హుస్నాబాద్ మెరవాలి
హుస్నాబాద్: మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేలా అధికారులు పని చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో పెండింగ్, పూర్తయిన పనులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనాలు, ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, మొక్కల పెంపకం వంటి పలు అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. పెండింగ్ పనుల ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీసీ రోడ్లు పెండింగ్ పనులను ఈనెలాఖరులోగా, ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులు మార్చిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్నవి, ప్రతిపాదనలు చేయాల్సిన పనులపై వివిధ శాఖల అధికారులతో త్రిసభ్య కమిటీ వేశారు. మున్సిపాలిటీకి రింగ్ రోడ్ త్వరలోనే మంజూరు అవుతుందని మంత్రి తెలిపారు. సమావేశంలో ఆర్డీఓ రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, అధికారులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దాలి
మంత్రి పొన్నం ప్రభాకర్
అధికారులతో మంత్రి సమీక్ష


