దత్తత.. దగా!
అక్కన్నపేట(హుస్నాబాద్): కేంద్ర ప్రభుత్వం 2014లో సంసద్ ఆదర్శ గ్రామ యోజన (గ్రామజ్యోతి) పథకాన్ని ప్రారంభించింది. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచ డం, జీవనోపాధి అవకాశాలు కల్పించడం, అసమానతలు తగ్గించడం, వారిలో చైతన్యం కలిగించడం, అభివృద్ధి పరచడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. లోక్‌సభ ఉభయ సభల సభ్యులందరూ ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించారు. ప్రతి ఎంపీ 2014 నుంచి 2019 వరకు మూడు గ్రామాలను అభివృద్ధి చేయాలని, తర్వాత 2023 వరకు ఏటా ఒక గ్రామం చొప్పున ఐదు గ్రామ పంచాయతీలను ఆదర్శ గ్రామ పంచాయతీలు తీర్చిదిద్దాలని నిర్ణయించారు. అందులో భాగంగా 2021–2022లో అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామాన్ని అప్పటి రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు దత్తత తీసుకున్నారు.
అర్ధంతరంగా నిలిచిన జీపీ భవనం
అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామం ‘పీఎం సంసద్ దత్తత గ్రామం కింద ఎంపిక అయింది. అయితే.. నిధులు మాత్రం మంజూరు కాలేదు. 2021–22 సంవత్సరంలో అప్పటి రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఈ పథకం కింద దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం గ్రామంలో పంచాయతీ భవనం నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు కాగా చేసిన పనులకు బిల్లులు రావట్లేదని మధ్యలోనే నిర్మాణ పనులను నిలిపివేశారు. దీంతో తాత్కాలిక భవనంలో గ్రామ పంచాయతీ భవనం కొనసాగుతోంది. అంతర్గత రోడ్లు లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పలుచోట్ల డ్రైనేజీ కాల్వలు లేకపోవడంతో రోడ్లపైనే మురికి నీరు ఏరులై పారుతోంది. రాజ్యసభ సభ్యుడు లక్ష్మీకాంతరావు దత్తత తీసుకోవడంతో గ్రామం రూపురేఖలు మారుతాయని ప్రజలు ఊహించారు. వర్షాలు కురిసినప్పుడు బురదమయంగా మారుతాయని కాలనీవాసులు చెబుతున్నారు.
బస్సు సౌకర్యం లేదు..
తారురోడ్డు సదుపాయం ఉన్నప్పటికీ ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. బస్సు సౌక ర్యం కల్పించాలని అధికారులను విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
అభివృద్ధికి నోచుకోని చౌటపల్లి
2021–2022లో దత్తత తీసుకున్న అప్పటి ఎంపీ లక్ష్మీకాంతరావు
కనీస వసతులు లేక అవస్థలు
అమలుకు నోచుకోని హామీలు
నివాస గృహాలు: 405
జనాభా: 1,550
దత్తత.. దగా!


