అత్యవసర వైద్య సేవలపై శిక్షణ
సిద్దిపేటకమాన్: ఎమర్జెన్సీ పరిస్థితుల్లో పేషెంట్లకు అందించే వైద్య సేవలపై వైద్యాధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు ప్రభుత్వ మెడికల్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ విమలాథామస్ తెలిపారు. శనివారం నేషనల్ ఎమర్జెన్సీ లైఫ్ సపోర్ట్ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఐదు మెడికల్ కళాశాలలకు చెందిన 20 మంది వైద్యాధికారులకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలకు చెందిన అనస్థీషియా విభాగం హెచ్‌ఓడీ, నోడల్ ఆఫీసర్ డాక్టర్ అనుపమ, డాక్టర్ సురేశ్‌బాబు, డాక్టర్ శివ, డాక్టర్ భానుప్రసాద్, డాక్టర్ జాన్సీ ఈ కార్యక్రమంపై ఈ ఏడాది ఆగస్టులో బనారస్ హిందూ యూనివర్సిటీలో శిక్షణ పొందారన్నారు. ఇదే అంశంపై ఎయిమ్స్ బీబీనగర్, జీఎంసీ నిజామాబాద్, కాకతీయ, గాంధీ, ఉస్మానియా మెడికల్ కళాశాలలకు చెందిన 20మంది వైద్యాధికారులకు ఈనెల 25నుంచి 29వరకు ఐదు రోజులు శిక్షణనిచ్చారని చెప్పారు. పేషెంట్లకు అత్యవసర వైద్య సేవలు ఎలా నిర్వహించాలి? సీపీఆర్, సర్జికల్ ట్రామా ఎమర్జెన్సీ, హార్ట్‌ఎటాక్, గర్భిణులు, చిన్న పిల్లలకు అత్యవసర వైద్య సేవలు అందించి వారిని సేవ్ చేసే విధానంపై శిక్షణ ఇచ్చామని వివరించారు. ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ చందర్, వైద్యాధికారులు పాల్గొన్నారు.
మెడికల్ కళాశాల డైరెక్టర్ విమలాథామస్


