పల్లెల్లో పాలిటిక్స్!
బరిలో బలమైన
అభ్యర్థుల ఎంపికకు కసరత్తు
ఎన్నికల ఖర్చు వెచ్చించేవారికే ప్రాధాన్యం
‘స్థానిక’ంగా రంజుగా రాజకీయాలు
గ్రామ పంచాయతీ ఎన్నికలు రంజుగా సాగుతున్నాయి. రాజకీయ పార్టీల గుర్తులతో ఎన్నికలు జరగనప్పటికీ గ్రామాల్లో కీలక పదవిలో ఉంటుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. జిల్లాలో మొదటి విడతలో ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. బలమైన అభ్యర్థిని బరిలో నిలిపితే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఎమ్మెల్యేలు, జిల్లా, మండల నాయకులు కసరత్తు చేస్తున్నారు. తక్కువ సమయం ఉండటంతో రెండో, మూడో విడతకు సంబంధించి పోటీదారుల్లో ఎవరు మెరుగనే విషయమై గ్రామాల వారీగా ఆశావహులతో రహస్య సమావేశాలను నిర్వహిస్తున్నారు.
– సాక్షి, సిద్దిపేట
ప్రధాన పార్టీలకు చెందిన నేతలు ఆయా పార్టీల నుంచి ఒక్కొక్కరే బరిలో నిలిచే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీ బలంగా ఉంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి, పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలవడం ద్వారా తమ సత్తా చాటాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. రాజకీయ పార్టీల నేతలు పల్లెల్లో విస్తృతంగా కార్యకర్తల సమావేశాలు నిర్వహించి అభ్యర్థి ఎంపికలో ఏకాభిప్రాయానికి వస్తున్నారు. ఏకాభిప్రాయం కుదరని చోట మండల, నియోజకవర్గ స్థాయి నేతలను రంగంలోకి దింపి బుజ్జగింపులు చేస్తున్నారు. భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తామని హామీలు ఇస్తున్నారు. ఎంపీటీసీ అవకాశం కల్పిస్తామని సర్దిచెబుతున్నారు. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు పోటీ చేస్తే ఇతర పార్టీలకు చెందిన వారికి అవకాశం ఇచ్చిన వాళ్లం అవుతామని జాగ్రత్త పడుతున్నారు.
ఆర్థిక పరిస్థితి పరిగణనలోకి..
అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. అభ్యర్థి ఎవరైతే బాగుంటుందన్నదానిపై చర్చిస్తున్నారు. అభ్యర్థికి వ్యక్తిగత ఫాలోయింగ్‌తోపాటు పార్టీకి, నాయకులకు విధేయుడిగా ఉండేలా చూసుకుంటున్నారు. దీనితో పాటు పార్టీకి చేసిన పనితీరును ఎంపికకు ప్రామాణికంగా భావిస్తున్నారు. వీరితోపాటు ప్రధానంగా ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటున్నారు. పోటీ చేసే అభ్యర్థి సొంతంగానే ఎన్నికల ఖర్చు పెట్టుకునే స్తోమత ఉందా లేదా అని చూస్తున్నారు. దీని వల్ల ఆయా పార్టీల్లో ఏళ్లుగా కష్టపడుతున్న పేద కార్యకర్తలు, నాయకులకు చుక్కెదురవుతోంది. కొన్నేళ్లుగా పార్టీలో ఉంటూ.. పలుకుబడి ఉన్నప్పటికీ ఆర్థికంగా వెనకబడి ఉన్న కొందరు నాయకులు, నేతలు ఆందోళన చెందుతున్నారు.
నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ
సాక్షి, సిద్దిపేట: గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ శనివారంతో ముగియనుంది. జిల్లాలో మొదటి విడతలో 7 మండలాలు 163 గ్రామ పంచాయతీలు, 1,432 వార్డులకు ఈ నెల 27 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. రెండో రోజు శుక్రవారం గ్రామ పంచాయతీలకు 194 నామినేషన్లు, వార్డు సభ్యులకు 445 నామినేషన్లు వచ్చాయి. మొత్తంగా ఇప్పటి వరకు సర్పంచ్ స్థానాలకు 325 మంది, వార్డు స్థానాలకు 520 మంది నామినేషన్లు వేశారు. శుక్రవారం అష్టమి కావడంతో తక్కువ సంఖ్యలో నామినేషన్లు వేశారని, శనివారం నవమి తిథి ఉన్నప్పటికీ మంచి ముహూర్తాన్ని తెలుసుకుని నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. చివరి రోజు కావడంతో ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు వచ్చే అవకాశాలున్నాయి.
‘పంచాయతీ’పై
ప్రధాన పార్టీల ఫోకస్
పల్లెల్లో పాలిటిక్స్!


