మల్లన్న కల్యాణానికి విస్తృత ప్రచారం
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లన్న కల్యాణం వచ్చే నెల 14న జరగనుంది. ఇందుకు ఆలయ అధికారులు విస్తృత ప్రచారం చేపడుతున్నారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా స్వామి కల్యాణ ఆహ్వాన వాల్ పోస్టర్లను అంటించారు. బాసర, మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడ, కొండగట్టు, సికింద్రాబాద్, హైదరాబాద్, బస్టాండ్‌లతో పాటు తదితర ప్రాంతాలలో వాల్‌పోస్టర్లను ఆలయ సిబ్బంది అతికించారు.
ఆలయంలో వేలంపాటలు
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో శుక్రవారం పలు అంశాలపై ఈఓ టంకసాల వెంకటేశ్ ఆధ్వర్యంలో వేలంపాటలు నిర్వహించారు. ఎల్లమ్మ ఆలయం వద్ద సంవత్సర కాలం కొబ్బరి కాయలు విక్రయించే లైసెన్సు హక్కును రూ.13 లక్షలకు చింతల వెంకటేశ్ దక్కించుకున్నారు. అన్నదాన సత్రం ఎదుట ఉన్న షాప్ నెం.1ను నెలకు అద్దె రూ.6,300లకు పి.అనిల్, షాప్ నెం 2ను రూ.6,200లకు ఎడుకొండలు దక్కించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
పూలే అడుగు జాడల్లో
నడుద్దాం
బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఉమేష్
చిన్నకోడూరు(సిద్దిపేట): మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఆయన అడుగు జాడల్లో నడుద్దామని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఉమేష్ అన్నారు. జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కేంద్రంలో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప సంఘసంస్కర్త పూలే అన్నారు. మహిళలకు విద్య అవసరమని చాటి చెప్పిన మాతృమూర్తి సావిత్రీబాయి పూలే అని తెలిపారు. సమావేశంలో జిల్లా నాయకులు తిరుపతి, బాబు, శంకర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ కార్యదర్శి
సస్పెన్షన్
కొండపాక(గజ్వేల్): మండలంలోని అంకిరెడ్డిపల్లి పంచాయతీ కార్యదర్శి జి. స్వామినాథ్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ కలెక్టరేట్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయని ఎంపీడీఓ వెంకటేశ్వర్లు తెలిపారు. విధులపై నిర్లక్ష్యం వహించడంతో పాటు విధాన పరమైన లోపాలతో నిధుల దుర్వినియోగానికి పాల్పడుతుండటంతో డీఎల్‌పీఓకు ఫిర్యాదు చేశారన్నారు. డీఎల్‌పీఓ విచారణ చేపట్టి నివేదికను కలెక్టరేట్‌లో అందించారన్నారు. దీంతో కార్యదర్శిని విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు.
నూతన గృహ నిర్మాణాలకు
అనుమతులు తప్పనిసరి
సిద్దిపేటకమాన్: నూతన గృహ నిర్మాణాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ అశ్రిత్‌కుమార్ తెలిపారు. సిద్దిపేట పట్టణం రాఘవేంద్ర నగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు మున్సిపల్ కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని, విరుద్ధంగా చేపడితే చర్యలు తప్పవన్నారు. మున్సిపల్ అనుమతులకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.
మల్లన్న కల్యాణానికి విస్తృత ప్రచారం
మల్లన్న కల్యాణానికి విస్తృత ప్రచారం


