అబార్షన్లు చేస్తే ఆస్పత్రులు సీజ్
● అర్హతకు మించి వైద్యం చేస్తే చర్యలు ● జిల్లా వైద్యాధికారి ధన్‌రాజ్
గజ్వేల్‌రూరల్: అక్రమంగా అబార్షన్లు చేసే వైద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆసుపత్రులను సీజ్ చేయడం జరుగుతుందని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ధనరాజ్ హెచ్చరించారు. శుక్రవారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని రాజిరెడ్డిపల్లి మార్గంలో ఓ మహిళ మృత శిశువును పొదల్లో పడేసినట్లు గుర్తించిన స్థానికులు వైద్యాధికారులకు సమాచారం అందించారన్నారు. ఇదే ప్రాంతంలో ఉండే ఓ నకిలీ వైద్యుడు అబార్షన్ చేసినట్లు తెలిసిందని, వెంటనే నకిలీ వైద్యుడు నిర్వహిస్తున్న ఆసుపత్రిని సీజ్ చేశామన్నారు. సదరు వైద్యునిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అర్హతకు మించి వైద్యం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. మండల స్థాయిలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీలో ఎమ్మార్వో, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్, మెడికల్ ఆఫీసర్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌తో కలిసి తనిఖీలు చేపట్టి అర్హతకు మించి వైద్యం చేసే ఆసుపత్రులను సీజ్ చేస్తామన్నారు.
మృతశిశువుకు పోస్టుమార్టం
పట్టణంలోని రాజిరెడ్డిపల్లికి వెళ్లే మార్గంలో చెట్ల పొదల మధ్య పడేసిన మృత శిశువుకు శుక్రవారం ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య, రెవెన్యూ అధికారులు, పోలీసుల సమక్షంలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. కార్యక్రమంలో గజ్వేల్ సీఐ రవికుమార్, ఆర్‌ఐ కృష్ణతో పాటు వైద్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
గర్భిణులకు అన్ని పరీక్షలూ చేయాలి
సిద్దిపేటకమాన్: గర్భిణులకు హెచ్‌ఐవీ పరీక్షలు, టీబీ టెస్ట్‌లతో పాటు అవసరమైన అన్ని రకాల పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ధనరాజ్ వైద్య సిబ్బందికి సూచించారు. సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలోని టీహబ్, టీబీ క్లినిక్‌ను డీఎంహెచ్‌ఓ సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పీహెచ్‌సీల నుంచి వచ్చిన రక్త నమునాలను టీహబ్‌లో పరీక్షించి ఆలస్యం కాకుండా తొందరగా ఫలితాలను అందజేయాలన్నారు. ఏఆర్‌టీ సెంటర్‌లో రోగులకు వైద్య సేవలు, మందులు అందించాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్‌యాదవ్, టీహబ్ మేనేజర్ అనిల్‌కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


