కిస్మత్ కుర్సీకా!
ఖర్చు పెట్టే అభ్యర్థులకే అవకాశాలు 613 పంచాయతీలు, 5,370 వార్డులకు ఎన్నికలు మూడు విడతలుగా ఎన్నికల నిర్వహణ జిల్లాలో ఓటర్లు 7,44,157 మంది
వస్తే పీఠం.. పోతే పొలం!
భారీ ఖర్చుకు సిద్ధమవుతున్న అభ్యర్థులు
జోగిపేట(అందోల్): పంచాయతీ ఎన్నికలను పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. ఖర్చు పెట్టేవారినే సర్పంచ్ అభ్యర్థులుగా బరిలోకి దింపేందుకు పార్టీలు నిర్ణయించడంతో భూములమ్ముకొని పోటీకి సిద్ధమవుతున్నారు. వస్తే పదవి...పోతే పొలం అన్న రీతిలో ఎన్నికలు జరుగుతున్నాయి.
జిల్లాలో 613 పంచాయతీ, 5370 వార్డులకు ఎన్నికలు మూడు విడతలుగా జరగనున్నాయి. జిల్లాలో ఓటర్లు 7,44,157 మంది ఓటర్లుండగా.. మహిళలు 3,75,843 మంది, పురుషులు 3,68,270 మంది ఓటర్లున్నారు. అందోలు మండలంలోని ఓ పంచాయతీలో స్థానికంగా ఎస్సీ జనరల్ రిజర్వుడు కాగా ఓ పార్టీకి చెందిన అభ్యర్థి తన అర ఎకరం భూమిని రూ.40 లక్షలకు విక్రయించి మరీ బరిలోకి దిగడం గమనార్హం. పుల్కల్ మండలంలోని ఓ గ్రామంలో అధికార పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థి తనను గెలిపిస్తే ఏకంగా 15 గ్రామాల్లో వ్యవసాయ భూములకు రూ.కోటి వెచ్చించి ఫార్మేషన్ రోడ్లు వేసేందుకు బాండ్ పేపర్ రాసి ఇవ్వడం చర్చనీయాంశశమైంది. అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడకుండా, తమ ఆస్తులు అమ్మి మరీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ పోటీ చేయాలని ఉత్సాహం ఉన్న వారికి సైతం సరైన ఆర్థిక స్తోమత లేకపోతే అభ్యర్థులుగా అవకాశం కల్పించే పరిస్థితులు కనిపించడం లేదు.
పంచాయతీలకు ఆదాయం!
స్థానిక ఎన్నికలు పంచాయతీలకు కాసుల పంట కురిపిస్తున్నాయి. పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటి పన్ను చెల్లించాలనే నిబంధన ఉంది. దీంతో పోటీ చేసే వారు పన్నులు చెల్లిస్తున్నారు. నామినేషన్ల స్వీకరణతో పలు గ్రామాల్లో ఇప్పటికే ఎన్నికల వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో వార్డు సభ్యులు, సర్పంచులుగా బరిలో నిలిచే అభ్యర్థులు తమ బకాయిలను పెండింగ్‌లో ఉంచుకోవద్దనే ఉద్దేశంతో ఇంటి పన్నులు చెల్లిస్తున్నారు. దీంతో మొండి బకాయిల సమస్య తీరింది. ప్రతి ఏడాది మార్చిలోపు వసూళ్ల ప్రక్రియ ముగుస్తుంది. నాలుగు నెలల ముందే బకాయిలు వసూలు అవుతుండటంతో సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఖర్చుపెట్టే వారికి పెద్దపీట..
జనరల్, బీసీ స్థానాల్లో పోటీ తీవ్రత అధికంగా ఉంది. ఎంత ఖర్చయినా కొందరు వెనుకాడటం లేదు. ఆశావహులు తమ అభ్యర్థిత్వాలు ఖరారు కాకముందే గ్రామాల్లో ప్రతిరోజు వేలల్లో ఖర్చు చేస్తున్నారు. సమావేశాలు పెడుతూ తనకే మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. జనరల్ పంచాయతీల్లో రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షలు ఖర్చు పెట్టే వారికి అవకాశం కల్పిస్తున్నారు. ఆయకట్టు గ్రామాల్లో సర్పంచ్ పదవికి ఎక్కువ డిమాండ్ ఉంది. అక్కడ రూ.50 లక్షల వరకు ఖర్చు పెట్టేందుకు పలువురు సిద్ధంగా ఉన్నారు. కొన్ని గ్రామాల్లో రూ.25 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు ఖర్చు చేసేందుకు సిద్ధమని అంటున్నారు. వస్తే సర్పంచ్ పదవి.. పోతే ఎకరం భూమి అంటూ బరిలో నిలిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈనెల 11న మొదటి విడత, రెండవ విడత 14న, మూడవ విడత ఎన్నికలు 17న జరగనున్నాయి.
కిస్మత్ కుర్సీకా!


