ఇక ప్రచార హోరు
● మొదటి విడత అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ● వారంలోపే ప్రచార సమయం ● అభ్యర్థుల ఉరుకులు పరుగులు
నారాయణఖేడ్: గ్రామ పంచాయతీ ఎన్నికల సమరానికి మొదటి విడత ఎన్నికల ప్రచారం ఈనెల 4వ తేద నుంచి ప్రారంభం కానుంది. నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణల అనంతరం బుధవారం సాయంత్రం పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను అధికారులు ప్రకటించారు. గుర్తులు కూడా కేటాయించడంతో ప్రచార పర్వం ముమ్మరం కానుంది. ముఖాముఖి పోటీలతోపాటు చాలా పంచాయతీల్లో ఇద్దరికంటే అధికంగా బరిలో నిలిచారు. ఎక్కువ మంది అభ్యర్థులు రంగంలో ఉన్న పంచాయతీల్లో పోటీ రసవత్తరంగా మారనుంది.
ప్రచారం వారంలోపే..
ఉపసంహరణలు, గుర్తుల కేటాయింపు పూర్తి కావడంతో ఈనెల 4వ తేదీ నుంచి ప్రచారం ప్రారంభించగా 11వ తేదీన పోలింగ్ నాటికి వారంలోపే ప్రచారం పూర్తి చేసుకోవాలి. అందునా 44 గంటల ముందే ప్రచార హోరును నిలిపేయాల్సి ఉంటుంది. అతి తక్కువ సమయం వారంలోపే వ్యవధి ఉంది. దీంతో అభ్యర్థులు వారికి కేటాయించిన గుర్తులతో కరపత్రాలు, వాల్‌పోస్టర్లు ముద్రించుకొని ఓటర్ల వద్దకు వెళ్లేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా చేసుకుంటున్నారు. ఏ రోజు సమయాన్ని వృథా చేసుకోకుండా ప్రచారంలో దూసుకెళ్లాలని చూస్తున్నారు. నేటి నుంచి మొదలయ్యే ఎన్నికల ప్రచార వేడి విడతల వారీగా జిల్లా మొత్తం అన్ని పంచాయతీల్లో మూడో విడత ప్రచారం పూర్తయ్యే డిసెంబర్ 17వరకు జిల్లాలో హోరు సాగనుంది.
వేర్వేరు గుర్తులు..
సర్పంచ్, వార్డు సభ్యుడికి వేర్వేరు గుర్తులు ఉండనున్నాయి. దీంతో ఎవరి ప్రచారం వారికే సరిపోతుంది. పంచాయతీలో ఉన్న వార్డుల వారీగా వార్డు సభ్యుడి అభ్యర్థితోపాటు ప్రచారం చేయాల్సిన బాధ్యత సర్పంచ్ అభ్యర్థులపై పడనుంది. పార్టీ పరంగా మద్దతు ఉన్న వార్డు సభ్యులకు అవసరమైన ఖర్చులు కూడా సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థులపైనే పడుతుంది. ఒక్కో వార్డుకు రూ.50వేల నుంచి లక్ష వరకు ఖర్చు తప్పేలా లేదని పోటీలో ఉన్న అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. గుంపులు, గుంపులుగా తిప్పుకోకుంటే తాము ఎక్కడ వెనుకబడ్డామోనన్న ప్రచారం మొదలవుతుందన్న బెంగ అభ్యర్థులను పట్టి పీడిస్తోంది. దీంతో వెంట వచ్చే వారికి కొన్ని ప్రాంతాల్లో కూలీ, దావత్ ఇస్తామంటూ నచ్చచెబుతూ వెంట తిప్పుకుంటున్నారు. గ్రామాలకు పెద్దనాయకులు ప్రచారానికి వచ్చిన సందర్భాల్లో ఎక్కువ మందిని పోగేయడంతో మరింత ఎక్కువ ఖర్చు అవుతుంది. పోటీల్లో ఉన్న అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడని పరిస్థితులు ఉండడంతో ఒక్కొక్కరికి ఖర్చు తడిసి మోపెడు కానుంది.


