కొత్త ఖాతాలు.. పన్ను చెల్లింపులు
● రద్దీగా బ్యాంకులు, కార్యాలయాలు ● ఇంటి, వ్యాపార పన్నులతో పంచాయతీలకు ఆదాయం ● పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కొత్తగా బ్యాంకు ఖాతా తీయాలనే నిబంధన ఉండటంతో అభ్యర్థులు బ్యాంకు బాట పట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖాతాల కొరకు వేచి ఉండడంతో రద్దీగా ఉంటున్నాయి. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా బ్యాంకు అధికారులు సైతం త్వరితగతిన ఖాతాలను అందిస్తున్నారు. సాధారణంగా ప్రతిరోజు బ్యాంకులు 6 గంటల లోపే మూసేస్తారు. కానీ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బ్యాంకు అధికారులు రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉండి కొత్త ఖాతాలు ఇస్తున్నారు. సర్వర్ డౌన్ ఉండటంతో కొంత ఆలస్యం అవుతుంది. అనంతరం ఖాతాలను తీసుకొని అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.
● అభ్యర్థులకు తప్పనిసరిగా సంబంధిత గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి నో డ్యూ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే పోటీ చేసే అభ్యర్థి తప్పనిసరిగా ఇంటి పన్నుతో పాటు కులాయి పన్ను, ఒకవేళ వ్యాపారం ఉంటే వ్యాపార పన్ను పూర్తిగా చెల్లించాలి. అయితే ఏ గ్రామ పంచాయతీలో పోటీ చేస్తున్నారో సంబంధిత కార్యాలయంలో నో డ్యూ సర్టిఫికెట్ కోసం పరుగులు తీస్తున్నారు. అంతే కాకుండా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల పన్నులు సైతం వసూలు అవుతున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. దీంతో పంచాయతీలకు ఆదాయం సమకూరుతుంది.
● నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు కేటాయించిన క్లస్టర్లకు రావడంతో అక్కడ సందడి నెలకొంటుంది. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండటంతో జిరాక్స్‌ల కోసం స్టేషనరీ, టీ దుకాణాలు, టిఫిన్ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. డబ్బులు వాయించే వారికి సైతం ఉపాధి దొరుకుతుంది.
● రద్దీగా బ్యాంకులు, కార్యాలయాలు ● ఇంటి, వ్యాపార పన్నులతో పంచాయతీలకు ఆదాయం
సంగారెడ్డి జోన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జిల్లాలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. మొదటి, రెండో విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో మూడో విడత నామినేషన్ల దాఖలు కొనసాగుతున్నాయి. అయితే పోటీ చేసే అభ్యర్థులకు పలు రకాల సర్టిఫికెట్లతో పాటు బ్యాంకు ఖాతా తప్పనిసరి కావటంతో ఆయా కార్యాలయాల్లో బారులు తీరుతున్నారు. దీంతో ఆయా పంచాయతీలు, బ్యాంకులు, వ్యాపార సంస్థలు, అభ్యర్థులతో సందడిగా మారుతున్నాయి.