పంచాయతీ బరిలో యువత
● పోటీలో ఎక్కువ మంది విద్యావంతులు ● పెరిగిన రాజకీయ చైతన్యం ● పాలనలో పారదర్శకత పెరిగే అవకాశం
సంగారెడ్డి జోన్: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు యువత ఆసక్తి చూపుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో యువత బరిలో నిలిచింది. ఇప్పటికే మొదటి, రెండో విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఎక్కువగా ఉన్నత చదువులు చదివిన విద్యావంతులు ఉండడం గమనార్హం. ఉమ్మడి మెదక్ జిల్లా సర్పంచ్ పదవితో పాటు వార్డు సభ్యుల పదవికి 60 శాతానికి పైగా యువకులు పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. తమ గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వారు ఈ దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.
పెరిగిన రాజకీయ చైతన్యం
యువత క్రీడలు, ఉద్యోగాలు, వ్యాపారాలలో రాణించడంతో పాటు రాజకీయాల్లో సైతం దూసుకుపోతున్నారు. ఉన్నత చదువులు చదివిన విద్యావంతులతో పాటు ఉద్యోగాలను సైతం వదులుకొని మరీ పోటీ పడుతుండటంతో వారిలో రాజకీయ చైతన్యం పెరిగిందని చెప్పుకోవచ్చు. గతంలో యువత రాజకీయాల్లో పోటీ చేసేందుకు అంతగా ఆసక్తి చూపించేవారు కాదు. పెద్దలు పోటీ చేస్తే ప్రచారంలో భాగస్వాములు అయ్యేవారు. గతంలో కంటే భిన్నంగా ప్రస్తుతం పెద్దలతో పాటు పార్టీ పెద్దల సహకారంతో పోటీకి సన్నద్ధం అవుతున్నారు. పాలనలో యువత భాగస్వామ్యం అయితే పరిపాలన పారదర్శకంగా జరగడంతోపాటు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గెలుపే లక్ష్యంగా ప్రచారం
పంచాయతీ ఎన్నికలలో యువత పోటీ చేయడమే కాకుండా గెలుపే లక్ష్యంగా తమదైన శైలిలో ప్రచార కార్యక్రమాలు చేపట్టుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతతో పోటీపడుతున్న ప్రపంచంలో సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకునే విధంగా తమకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. అభ్యర్థి పేరు, గ్రామం పోటీ చేస్తున్న పదవితో పాటు తదితర వివరాలతో పోస్టర్లు తయారు చేస్తున్నారు. అదేవిధంగా వీడియోలో సైతం రూపొందించి వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియా ద్వారా ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


