అవగాహనతోనే నియంత్రణ
● జిల్లాలో పెరుగుతున్న హెచ్‌ఐవీ కేసులు
● నేడు ప్రపంచ ఎయిడ్స్ దినం
సంగారెడ్డి క్రైమ్: అవగాహనే ఎయిడ్స్ నియంత్రణకు సరైన టీకా అని వైద్యులు పేర్కొంటున్నారు. హెచ్‌ఐవి అని తెలియగానే అశ్రద్ధ చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో వైద్య సేవలు పొంది ఆరోగ్యంగా జీవించవచ్చు అని వైద్యాధికారులు, నిపుణులు సూచిస్తున్నారు. ఎయిడ్స్‌కు.. మధుమేహం, బీపీ, ఆస్తమా రోగాల మాదిరిగానే మందులు వాడటం ద్వారా మంచి ఆరోగ్యం పొందవచ్చు. హెచ్‌ఐవి ఉన్న దంపతులు తగిన సమయంలో ఏఆర్‌టి మందులు వాడితే పుట్టబోయే పిల్లలకు ఎలాంటి రోగాలు లేకుండా జన్మనివ్వొచ్చు. ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988 నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన నిర్వహిస్తుంది. వైద్య ఆరోగ్య శాఖ, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
హెచ్‌ఐవి నిర్ధారణ ఇలా..
ఎయిడ్స్ అనేది హెచ్‌ఐవి (హ్యూమన్ ఇమ్యునో డెఫిసియెన్సీ వైరస్) అనే వైరస్ వల్ల వస్తుంది. ఈ వ్యాధి సోకితే మానవ శరీరంలోని రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తుంది. తద్వారా ఎయిడ్స్ వ్యాధులు వస్తాయి. హెచ్‌ఐవి వైరస్ ఉన్న అందరికీ ఎయిడ్స్ ఉన్నట్లు కాదు. అవి శరీరం లోపల కొన్ని నెలల పాటు ( 6 నుంచి 7 నెలలు) ఆర్యోగంగా ఉన్న మానవ రోగనిరోధక శక్తిని పూర్తిగా నాశనం చేస్తుంది. రక్త పరీక్ష చేసిన సమయంలో రోగనిరోధక శక్తి క్షీణించినప్పుడు వ్యాధి లక్షణాలు త్వరగా బయటపడతాయి. వీటి నిర్ధారణకు ఏఆర్‌టీ సెంటర్ పరీక్షలో కణాల సంఖ్య 25 శాతం కంటే తక్కువగా ఉన్నప్పుడు ఈ వ్యాధి సోకినట్లుగా వైద్యులు గుర్తిస్తారు.
అవగాహన కల్పిస్తున్నా..
జిల్లాలో హెచ్‌ఐవి కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అవగాహన కల్పిస్తున్నప్పటికీ కనీస జాగ్రత్తలు కూడా పాటించకపోవడంతో బాధితులు పెరుగుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సంగారెడ్డితో కలిపి మొత్తం 5 ఏఆర్‌టీ కేంద్రాలున్నాయి. (నర్సాపూర్, పటాన్‌చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్ ) ఇక్కడి నుంచి హెచ్‌ఐవి రోగులకు మందులు పంపిణీ చేస్తారు. సంగారెడ్డి నోడల్ మెడికల్ అధికారులతో పాటు కౌన్సిలర్లు, డాటా ఎంట్రీ, ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్ ద్వారా నిరంతరం పర్యవేక్షణలో మందులు పంపిణీ చేస్తున్నారు. అలాగే హెచ్‌ఐవి, ఎయిడ్స్ బాధితులకు ప్రభుత్వం రూ.200 నుంచి రూ.వెయ్యి ఆర్థిక సహాయం చేస్తుంది. ప్రభుత్వం ఒక్కొక్క బాధితుడిపై దాదాపు రూ.లక్ష సంవత్సరానికి ఖర్చు చేస్తుంది.
జాగ్రత్తలు తప్పనిసరి
ప్రతి ఒక్కరికి ఎయిడ్స్‌పై అవగాహన అవసరం. స్వీయ నియంత్రణ లేకపోవడంతో హెచ్‌ఐవి కేసులు పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం, ఎన్‌జీఓలతో కలిసి గ్రామాల్లో కార్యక్రమాలు చేపడుతున్నారు. బాధితులు వైద్యుల సలహా మేరకు టెస్ట్‌లు చేసుకొని మందులు వాడాలి.
– డాక్టర్ సీహెచ్ మృత్యుంజయ రావు, ప్రభుత్వ ఆస్పత్రి, సంగారెడ్డి
అవగాహనతోనే నియంత్రణ


