రైతులపై టార్పాలిన్ల భారం
● రోజుల తరబడి కల్లాల్లోనే వరిధాన్యం
● కిరాయి చెల్లిస్తున్న అన్నదాతలు
దుబ్బాకటౌన్: కొన్నేళ్లుగా ప్రభుత్వం నుంచి సబ్సిడీ టార్పాలిన్ కవర్లు రాకపోవడంతో రైతులు అద్దెకు తెచ్చుకొని వేలకు వేలు చెల్లిస్తున్నారు. ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన పంటను కాపాడుకోవడానికి వారు పడే కష్టం అంతా ఇంతా కాదు. ధాన్యం ఆరబెట్టడానికి టార్పాలిన్ కవర్లే దిక్కు కావడంతో వేల రూపాయల కిరాయి చెల్లిస్తున్నామని అన్నదాతలు వాపోతున్నారు. అయితే గతంలో వ్యవసాయ సహకార సంఘం నుంచి ప్రతి రైతుకు సబ్సిడీ ద్వారా టార్పాలిన్ కవర్లు అందజేసేవారని, అవి రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు.
రైతులు వరి కోసి కొనుగోలు కేంద్రాలకు తరలించినప్పటి నుంచి వడ్లను ఆరబోయడానికి, వడ్లపై కప్పి ఉంచడానికి టార్పాలిన్ కవర్లను వాడుతారు. వాటిని ఆయా గ్రామాల్లో ఉన్న వ్యక్తుల వద్ద కిరాయికి తెచ్చుకుంటున్నారు. ఒక్కో టార్పాలిన్ కవర్ కిరాయి ఒకరోజుకు రూ.30 ఉంటుంది. ఎకరానికి 5 టార్పాలిన్ కవర్ల అవసరం ఉంటుంది. దీంతో ఒక రైతు ఒక రోజుకు కిరాయి రూ.150 చెల్లిస్తున్నాడు. ఇదే విధంగా ఒక్కో రైతు వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ఇప్పటికే 7 నుంచి 10 రోజులు కల్లాల్లోనే వడ్లను ఉంచారు. దీంతో ఒక్కో రైతుపై అదనంగా భారంగా పడుతోంది. ఈ టార్పాలిన్ల కిరాయిలు చెల్లించలేక నానా అవస్థలు పడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
రాయితీ టార్పాలిన్ కవర్లేవి?
కొన్నేళ్ల క్రితం ప్రభుత్వ హయాంలో వ్యవసాయ శాఖకు టార్పాలిన్ కవర్లు అందజేసి రైతులకు సబ్సిడీలో ఇచ్చేవారు. ప్రతి రైతు వాటిని కొనుగోలు చేసి రాయితీ పొందేవారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం నుంచి టార్పాలిన్ కవర్లు ఇవ్వడం లేదు. ప్రతి సీజన్‌లో రైతులు సబ్సిడీలో టార్పాలిన్ కవర్లు వస్తాయేమో అని వ్యవసాయ శాఖ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు రాకపోవడంతో రైతులు టార్పాలిన్ల కిరాయిలు చెల్లిస్తూ మరింత భారం మోయాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు.
రైతులపై టార్పాలిన్ల భారం


