
సాంకేతిక నైపుణ్యత పెంపొందించుకోవాలి
ఎస్పీ పరితోశ్ పంకజ్
సంగారెడ్డి జోన్: మారుతున్న కాలానికనుగుణంగా ప్రతి ఒక్కరూ సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని, విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఎస్పీ పరితోశ్ పంకజ్ సూచించారు. ఎస్పీ కార్యాలయంలో వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న టెక్నికల్ సిబ్బందికి గురువారం ఒకరోజు శిక్షణ తరగతి నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎస్పీ పరితోశ్ మాట్లాడుతూ... ఎఫ్‌ఐఆర్ మొదలుకుని డేటా ఎంట్రీ, వివిధ రకాల కేసుల నమోదులో ఏమైనా సందేహాలుంటే శిక్షణ తరగతుల ద్వారా తెలుసుకోవచ్చన్నారు. వర్టికల్ విభాగంలో జిల్లాను ముందంజలో ఉండే విధంగా చూడాలని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు, నాణ్యమైన నేరపరిశోధన చేసేందుకు వివిధ రకాల యాప్‌లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. సమావేశంలో వర్టికల్ మానిటరింగ్ అధికారి, జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.