
కుటుంబ సమేతంగా దొంగతనాలు
సంగారెడ్డి టౌన్ : వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న కుటుంబ సభ్యుల ముఠాను బుధవారం సంగారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్ బుధవారం సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. సంగారెడ్డికి చెందిన యాదగిరి(44), అతడి భార్య అనిత(42), కుమారుడు మైనర్ బాలుడు(17), ముస్లాపూర్ గ్రామానికి చెందిన తలారి లక్ష్మీ (34) బుధవారం సంగారెడ్డి పట్టణంలో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు జల్సాలకు అలవాటు పడి తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని హత్నూర, సంగారెడ్డి టౌన్ రంగారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏడాది ఆరు దొంగతనాలతోపాటు వికారాబాద్ నర్సాపూర్ మోమిన్‌పేటలో మొత్తం 53 దొంగతనాలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితుల నుంచి 29 తులాల బంగారం, 47 తులాల వెండి, రూ.4 లక్షల నగదు, బైక్‌ను స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. కేసులో కీలకంగా వ్యవహరించిన రూరల్ సీఐ క్రాంతి కుమార్, ఎస్‌ఐ రవీందర్, క్రైమ్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
దారి దోపిడీ కేసులో ముగ్గురు అరెస్ట్
తూప్రాన్: దారి దోపిడీ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ శివానందం బుధవారం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌కు చెందిన మనీశ్ కుమార్ గుర్జీ గత నెల 30న మేడ్చేల్ నుంచి ఆటోలో వస్తున్న క్రమంలో డ్రైవర్‌తోపాటు మరో ఇద్దరు దాడి చేసి నగదు,సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టి మేడ్చేల్‌కు చెందిన మల్లేశం, బొల్లారానికి చెందిన శ్రీకాంత్, నేరేడ్‌మెట్‌కు చెందిన మధును గుర్తించి అరెస్టు చేశామని తెలిపారు.
నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
భారీగా బంగారం, రూ.4 లక్షల నగదు స్వాధీనం