
నిర్మాణానికి రూ.కోట్లు.. తీరని పాట్లు
హుస్నాబాద్: స్థానిక చిరు వ్యాపారస్తుల కోసం ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించి హుస్నాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన రైతు బజార్ నిరుపయోగంగా మారింది. దీంతో రైతులు పండించిన తాము పండించిన కూరగాయాలను పట్టణంలోని మల్లె చెట్టు చౌరస్తా, బస్టాండ్ ఏరియా, అంబేడ్కర్ చౌరస్తాలో రోడ్లపైన ఎండకు ఎండుతూ, వానకు నానుతూ అమ్ముకుంటున్న పరిస్థితి నెలకొంది.
రూ.3 కోట్లతో నిర్మాణం
రైతులు పండించిన పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు వీలుగా ప్రభుత్వం పట్టణంలోని శివాజీనగర్‌లో రూ.3 కోట్ల వ్యయంతో రైతు బజార్‌ను నిర్మించింది. జనవరి 5, 2025న మంత్రి పొన్నం ప్రభాకర్ భవనాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. కానీ అధికారుల మధ్య సమన్వయం లేక ప్రస్తుతం అది నిరుపయోగంగా మారింది. మున్సిపాలిటీకి చెందిన స్థలంలో వ్యవసాయ మార్కెట్ యార్డు తమ నిధులతో రైతు బజార్ భవనాన్ని నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో రైతు బజార్ కోసం 6 షెటర్లు నిర్మించారు. పై రెండు అంతస్తుల్లో సువిశాలంగా ఫంక్షన్ హాల్ నిర్మించారు. రైతు బజార్, ఫంక్షన్ హాల్ ద్వారా వచ్చే ఆదాయమంతా వ్యవసాయ మార్కెట్‌కే చెందుతుంది. రోడ్లపై కూరగాయలు అమ్ముతున్న రైతులు, చిరు వ్యాపారులను రైతు బజార్‌కు రప్పించే అధికారం మున్సిపల్ అధికారులకు ఉంటుంది. కానీ తమకు ఆదాయం లేదని రైతు బజార్‌కు తమకు ఎలాంటి సంబంధం లేనట్లుగా మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్నారు.
కొన్నేళ్ల నుంచి రోడ్లపైనే విక్రయాలు
వివిధ మండలాల రైతులు తాము పండించిన కూరగాయలు అమ్ముకునేందుకు నిత్యం హుస్నాబాద్‌కు వస్తుంటారు. పట్టణంలో ఇంత వరకు కూరగాయల మార్కెట్ గానీ, రైతు బజార్ గానీ లేదు. దీంతో కొన్నేళ్ల నుంచి రైతులు పండించిన పంటలను రోడ్ల పైనే అమ్మకాలు కొనసాగిస్తున్నారు. రైతు బజార్ వినియోగంలోకి వస్తే తాజా కూరగాయలు, ఇతరాత్ర పంట ఉత్పత్తులు ప్రజలకు తక్కువ ధరలకే లభించనున్నాయి. అలాగే, రోడ్ల పైనే కూరగాయలు అమ్మడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుంది. గతంలో పోలీస్‌లు రోడ్లపై కూరగాయలు అమ్మొద్దని తరాజులను తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. రైతు బజార్‌ను నిర్మించిన వ్యవసాయ మార్కెట్ అధికారులు, పాలకవర్గం పట్టించుకోకపోవడం వల్లనే రైతు బజార్ అలంకారప్రాయంగా మారిందని విమర్శలు వెలువెత్తుతున్నాయి.
నిరుపయోగంగా హుస్నాబాద్ రైతు బజార్
స్థలం ఒకరిది.. నిర్మాణం మరొకరిది
అధికారుల మధ్య లోపంతో తెరుచుకోని భవనం
రోడ్ల వెంటే కూరగాయల అమ్మకాలు
ఇబ్బందులు పడుతున్న వ్యాపారులు
పది రోజుల్లో అందుబాటులోకి తెస్తాం
రైతు బజార్‌లో టాయిలెట్లు, లైటింగ్ సిస్టమ్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఎప్పటికప్పుడూ పనులను పర్యవేక్షిస్తున్నాం. పది రోజుల్లో పనులు పూర్తి చేసి రైతుల ముంగిటకు రైతు బజార్‌ను తెస్తాం. అన్ని సౌకర్యాలతో రైతు బజార్‌ను రైతులకు అందుబాటులోకి తీసుకొస్తాం.
– కంది తిరుపతి రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, హుస్నాబాద్

నిర్మాణానికి రూ.కోట్లు.. తీరని పాట్లు