
సీ్త్రనిధి.. వడ్డీ ఏదీ?
ఐదేళ్లుగా పెండింగ్
● మహిళా సంఘాల ఎదురుచూపు ● అధికారుల్లో స్పష్టత కరువు
వట్‌పల్లి(అందోల్): స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం వారికి స్వల్ప వడ్డీకి రుణాలు అందజేస్తోంది. బ్యాంకు లింకేజీతో పాటు సీ్త్రనిధి వంటివి మంజూరు చేస్తోంది. వాయిదాలు సక్రమంగా చెల్లించిన వారికి వడ్డీ తిరిగి చెల్లిస్తోంది. అయితే 2019 నుంచి వడ్డీ అందడం లేదని సీ్త్రనిధి లబ్ధిదారులు పేర్కొంటున్నారు.
వడ్డీ కోసం ఎదురుచూపు..
జిల్లాలో 19,508 స్వయం సహాయక, 697 గ్రామైక్య సంఘాలు ఉన్నాయి. వీటిలో 365 సంఘాల్లోని సుమారు 2,10,391 మంది సభ్యులు సీ్త్రనిధి రుణాలు తీసుకొని వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్నారు. బ్యాంకు లింకేజీ రుణాలు సక్రమంగా చెల్లించిన వారికి ప్రభుత్వం 2012 నుంచి సీ్త్రనిధి రుణాలను మంజూరు చేస్తోంది. ఒక్కో సభ్యురాలికి వ్యక్తిగత రుణం రూ.40వేల నుంచి రూ.3లక్షల వరకు అందిస్తోంది. వాయిదాలు సక్రమంగా చెల్లించిన వారికి వడ్డీ తిరిగి చెల్లించాల్సి ఉండగా నాలుగేళ్లు దాటినా ఆ ఊసే లేదని ఆయా సంఘాల సభ్యులు పేర్కొంటున్నారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాంకు లింకేజీ రుణాలకు సంబంధించి కేవలం నాలుగు నెలలకు సంబంధించిన వడ్డీ విడుదల చేసింది. సీ్త్రనిధికి సంబంధించిన వడ్డీని మాత్రం పెండింగ్‌లో పెట్టింది. త్వరగా వడ్డీ డబ్బులు తిరిగి చెల్లించాలని మహిళా సంఘాల సభ్యులు కోరుతున్నారు.
మంజూరవగానే
సభ్యుల ఖాతాల్లో జమ
సీ్త్రనిధికి సంబంధించి రుణాలు సక్రమంగా చెల్లించిన ఆయా సంఘాల సభ్యులకు వడ్డీ చెల్లింపు ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న మాట వాస్తవమే. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే నేరుగా సభ్యుల ఖాతాల్లో జమవుతాయి.
– శ్రీనాథ్, సీ్త్రనిధి సంస్థ రీజినల్ మేనేజర్