
పాలీసెట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
సంగారెడ్డి టౌన్: పాలీసెట్ 2025 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సంగారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జానకి దేవి తెలిపారు. పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం ఆమె పరిశీలించారు. ఈనెల 13న నిర్వహించే పరీక్షకు జిల్లాలో 2784 మంది విద్యార్థులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. సంగారెడ్డిలో 7 సెంటర్ లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఒక గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
నిరవధిక సమ్మె తప్పదు
సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు కె.రాజయ్య
పటాన్‌చెరు టౌన్: లేబర్ కోడ్‌లపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే నిరవధిక సమ్మె తప్పదని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజయ్య కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను పురస్కరించుకుని పటాన్‌చెరు పట్టణంలోని అగర్వాల్ పరిశ్రమలో కార్మికులతో కలసి శనివారం సమ్మె పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ...లేబర్‌కోడ్‌లు వస్తే కార్మికులు కట్టు బానిసలుగా మారడం తప్పదన్నారు. రైతులు ఉద్యమించినట్లుగా కార్మికులు కూడా పోరాడాలని, దానికి అందరూ సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు రామకృష్ణ, సత్యనారాయణ, రవీంద్రుడు తదితరులు పాల్గొన్నారు.
కిందకు తోసి...
నిలువునా దోచుకుని
వృద్ధురాలి మెడలో పుస్తెలతాడు,
నగదు ఎత్తుకెళ్లిన ఆటో డ్రైవర్
పటాన్‌చెరు టౌన్: వృద్ధురాలి ఐదున్నర తులాల పుస్తెలతాడు, రూ .10 వేల నగదు ఆటోడ్రైవర్ ఎత్తుకెళ్లిన ఘటన అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన సుబ్రమణ్య భారతి(74) ఈనెల 9న అమీన్‌పూర్ కనకదుర్గ దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకుని, అనంతరం స్వస్థలం అయిన అల్వాల్‌లో తన ఇంట్లో అద్దెకు ఉండే వారి దగ్గర నుంచి రూ.10 వేలు అద్దె వసూలు చేసుకుని తిరిగి కూకట్‌పల్లి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. దీంతో ఆ ఆటో డ్రైవర్ మెయిన్ రోడ్డు మీదుగాకాకుండా గల్లీలో నుంచి వెళ్దామని చెప్పి, షాపూర్ మీదుగా మళ్లించి అమీన్‌పూర్ శివారులోని నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆటో ఆపి భారతిని కిందకు తోసి, ఆమె మెడలో ఉన్న ఐదున్నర తులాల బంగారు పుస్తెలతాడు, రూ.10 వేల నగదు లాక్కొని పారిపోయాడు. దీంతో బాధితురాలు జరిగిన ఘటనను శనివారం అమీన్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
కలశ ప్రతిష్ట మహోత్సవం
ములుగు(గజ్వేల్): మండలంలోని పాత మామిడ్యాల మెట్టు చింత వద్ద రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి వ్యవసాయ క్షేత్రంలో కొలువైన ఆభయాంజనేయస్వామి ఆలయ శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఈ సందర్బంగా ఆలయంలో రేణుకాచౌదరి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలశాలకు అభిషేకాలు, పూజగర్త సంస్కారం, కుంబాభిషేకం, పూర్ణాహుతి మార్జనం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ అన్నదానం చేశారు.