
కబ్జానా..కూల్చేయ్..!
దడపుట్టిస్తున్న
తహసీల్దార్
పటాన్‌చెరు: అమీన్‌పూర్ తహసీల్దార్ ఎన్.వెంకటస్వామి పనితీరు స్థానికులను ఆకట్టుకుంటుంది. ఆయన మనూర్ నుంచి బదిలీపై అమీన్‌పూర్‌కు వచ్చిన నెల రోజుల వ్యవధిలోనే కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములను కాపాడారు. ఇంతకుముందు ఇక్కడ పని చేసిన తహసీల్దార్‌ల అలసత్వం వల్ల అనేక ప్రభుత్వ భూములు కబ్జాదారుల పరమయ్యాయి. కోర్టు వివాదాల పరిధిలో ఉన్న భూముల్లో క్రయవిక్రయాలు జరిగాయి. పట్టణంలోని సర్వే నెంబర్ 343, 993లో అక్రమణలు కొనసాగాయి. అయితే తాజాగా వచ్చిన తహసీల్దార్ వెంకటస్వామి మాత్రం స్థానికుల నుంచి ఫిర్యాదు అందుకున్న వెంటనే క్షేత్రస్థాయిలో జేసీబీతో ప్రత్యక్షమవుతుండటం స్థానికులను ఆకట్టుకుంటోంది.
వచ్చినప్పట్నుంచీ ఇప్పటివరకు...
వెంటకస్వామి ఇక్కడకు వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కిష్టారెడ్డిపేటలోని సర్వేనంబర్ 164లో 30గుంటల భూమిని కాపాడారు. అక్కడ పార్కు ఏర్పాటు చేస్తే బాగుంటుందని జిల్లా కలెక్టర్‌కు నివేదించారు. సర్వే నంబర్ 343లో ఆక్రమణలను తొలగించారు. అక్కడ ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు భూమి అసైన్ అయ్యిందని చెప్తూ సర్వే నంబర్ 343లో తప్పుడు డాక్యుమెంట్లతో కబ్జాలకు తెగబడిన వారి ఆటలు సాగనివ్వలేదు. సర్వేనంబర్ 455లో సమ్మక్క సారక్క గుడి పరిధిలో నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిసిన వెంటనే వాటిని జేసీబీతో కూల్చి వేయించారు. సర్వే నంబర్ 993లో వెలసిన కబ్జాలను పోలీసులను వెంటేసుకుని వచ్చి వాటిని తొలగించారు. సుల్తాన్‌పూర్ సర్వేనంబర్ 30లో కూడా కబ్జా నిర్మాణాలను కూల్చివేశారు. కబ్జాలకు పాల్పడిన నలుగురిపై కేసులు నమోదు చేశారు.
తాజాగా గురువారం అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని సుల్తాన్‌పూర్‌లో సర్వే నంబర్ 381లో ప్రభుత్వ భూమిలో 12 అక్రమ నిర్మాణాలు, నాలుగు బేస్మెంట్ స్థాయిలో ఉన్న నిర్మాణాలను జేసీబీ సహాయంతో కూల్చేశారు.
గజం కూడా కబ్జాకు గురికాకూడదు
ఎక్కడ కబ్జాలు జరగుతున్నాయని తెలిసినా వెంటనే వాటిని కూల్చివేస్తాం. ఒక గజం కూడ కబ్జాకు అనుమతించేది లేదు. ఉన్నని రోజులు అక్రమాలను అడ్డుకుంటాం. రాజకీయ నాయకుల, ప్రజాప్రతినిధుల ఒత్తిడికి తలొగ్గను.
– వెంకటస్వామి, తహసీల్దార్, అమీన్‌పూర్