
బాల్య వివాహాలు జరగకుండా చర్యలు
సంగారెడ్డి జోన్: గ్రామాల్లో బాల్య వివాహాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. గురువారం సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో భరోసా కేంద్రం ఆధ్వర్యంలో పొక్సో, లైంగిక దాడుల కేసులపై అంగన్వాడీ టీచర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాల లోపు జరిగే లైంగిక దాడులను పోక్సో కేసులుగా పరిగణిస్తారని తెలిపారు. గ్రామాల్లో గ్రామ కమిటీల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి కేసులపై అవగాహన కల్పించి, నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లలిత కుమారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య, భరోసా కోఆర్డినేటర్ దేవలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.