
మున్నూరు కాపుల సంక్షేమానికి కృషి
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు: మున్నూరు కాపు కులస్తుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పట్టణ మున్నూరు కాపు సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పేద, బడుగు బలహీన వర్గాల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. వారి వారి కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి సహకారం అందించాలని సూచించారు. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆడపిల్లల పెండ్లికి, మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తూ నిర్ణయాలు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పటాన్‌చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు సపాన దేవ్, శంకర్ యాదవ్, ఆదర్శ్ రెడ్డి, భిక్షపతి, సంఘం నూతన అధ్యక్షుడు భోజయ్య, ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్, సంఘం సభ్యులు పాల్గొన్నారు.