
ఆర్‌ఈఏసీ సభ్యురాలిగాకౌడిపల్లి మహిళా రైతు
● కంచన్‌పల్లి గ్రామానికి చెందిన
లక్ష్మీకి అరుదైన గౌరవం
● వ్యవసాయ పొలంలో సేంద్రియ
పద్ధతిలో వరి, కూరగాయలు సాగు
కౌడిపల్లి(నర్సాపూర్): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఏయూ) ఆర్‌ఈఏసీ (రిసెర్చ్ అండ్ ఎక్స్‌టెన్షన్ అడ్వైజరీ కౌన్సిల్) సభ్యురాలిగా కౌడిపల్లి మండలం కంచన్‌పల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు నాయిని లక్ష్మీ ఎంపిక అయ్యారు. గురువారం విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. నత్నయపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త శోభ తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్‌లోని పీజేటీఏయూలో గురువారం ఆర్‌ఈఏసీ సమావేశం వైస్ చాన్స్‌లర్ అల్దాస్ జానయ్య అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు రైతులు ఎంపిక కాగా ఇందులో లక్ష్మీని ప్రభుత్వం ఎంపిక చేసిందని రెండేళ్లపాటు సభ్యురాలిగా కొనసాగుతుందన్నారు. లక్ష్మీ కంచన్‌పల్లిలోని తన వ్యవసాయ పొలంలో సేంద్రియ పద్ధతిలో వరి, కూరగాయలతోపాటు అదనపు ఆదాయం కోసం ఒరంగట్టుపై టేకు మొక్కలు పెంపకం, కోళ్లఫారమ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ ఇచ్చిన మినికిట్స్‌తో విత్తన వరిని సైతం సాగు చేస్తుందన్నారు. ఆర్‌ఈఏసీ సమావేశంలో రైతులకు అందుబాటులో ఉండేలా నర్సాపూర్‌లో విత్తన గోదాం, టింబర్ గోదాం నిర్మించాలని సూచించినట్లు తెలిపారు.