
వామ్మో... చిరుత!
●ఇక్రిశాట్‌లో సంచారం ●భయాందోళనలో ప్రజలు
ఎక్కడ నుంచి వస్తున్నాయి..?
అసలు ఇక్రిశాట్‌లో చిరుతలు ఎక్కడ నుంచి వస్తున్నాయన్న ప్రశ్నకు సమాధానం మాత్రం చిక్కడం లేదు. గతంలో వచ్చిన చిరుతను ఎవరో పెంచుకుని ఇక్రిశాట్‌లో వదిలేఽశారని చర్చ జోరుగా సాగింది. దాని కారణంగా దానిని పట్టుకోవడం కోసం బోనులో మేకను ఉంచితే అది దానిని తినకుండా మేకతో ఆడుకుని పోయిందనే ప్రచారం జరిగింది. ఇక్రిశాట్ వెనుక భాగంలో రైల్వేలైన్ ఉండటంతో వికారాబాద్ అటవీ ప్రాంతంలో నుంచి రైల్వేట్రాక్ మీదగా ఇక్రిశాట్‌లోకి వస్తున్నాయన్న వాదన సైతం వినిపిస్తోంది. చిరుతలకు రాత్రి సమయంలో సంచరించే అలవాటు ఉంటుందని అలా కూడా ఇక్కడికి వచ్చి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక్రిశాట్‌లో పెద్దపెద్ద చెట్లు ఉండటంతో పాటు వాటికి కావలసిన నీరు, ఆహారం లభించడంతో ఇక్కడ తిష్ట వేసే అవకాశం కూడా లేకపోలేదని వాదన కూడా వ్యక్తమవుతోంది.
రామచంద్రాపురం(పటాన్‌చెరు): రామచంద్రాపురం పట్టణంలోని ఇక్రిశాట్‌లో తాజాగా చిరుత చిక్కడంతో స్థానిక ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తోంది. ఇక్రిశాట్‌లో చిరుత సంచరిస్తున్న విషయం అధికారులు గోప్యంగా ఉంచి వేట మొదలు పెట్టారు. ఎవరూ ఊహించని విధంగా బోను ఏర్పాటు చేసిన ఒక్కరోజులోనే చిరుత చిక్కడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే మరోవైపు ఇక్రిశాట్‌లో మరో చి రుత కూడా సంచరిస్తుందన్న అనుమానంతో అటవీ శా ఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తుంది.
గతంలో చిక్కిన రెండు చిరుతలు..
ఇక్రిశాట్‌లో మొట్టమొదటిసారిగా 2014 ఆగస్టులో ఇక్రిశాట్‌లో చిరుత చిక్కింది. ఆ సమయంలో చిరుత కనిపించిన 150 రోజులకు తర్వాతగానీ బోనుకు చిక్కలేదు. తిరిగి 2019లో ఇక్రిశాట్‌లో చిరుత కనిపించడంతో రంగంలోకి దిగిన అధికారులు 120రోజులు శ్రమిస్తేగానీ చిరుత చిక్కలేదు. తాజాగా చిరుతను గుర్తించిన కొద్ది రోజుల్లోనే చిరుత చిక్కడం విశేషం. ఇప్పటివరకు అటవీ శాఖ అధికారులు ఇక్రిశాట్‌లో మూడు చిరుతలను పట్టుకున్నారు.
మరికొన్ని ఉండవచ్చని అనుమానం!
తాజాగా ఓ చిరుత అధికారులు చిక్కినప్పటికీ, మరొకటి కూడా ఇక్రిశాట్‌లోనే సంచరిస్తుందన్న అనుమానాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు ఇప్పటికీ ఓ నిర్ధారణకు రాకపోయినా అక్కడ ఏర్పాటు చేసిన ఆధునిక సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇక్రిశాట్‌లో వెయ్యి ఎకరాలకు పైగాభూమి ఉంటుంది. దాంతో ఇందులో మరిన్ని చిరుతలు ఉండవచ్చని స్థానికులు చర్చించుకుంటున్నారు.
భయాందోళనలో స్థానికులు..
ఇక్రిశాట్‌ను ఆనుకొని రామచంద్రాపురం, పటాన్‌చెరు పట్టణంతోపాటు, తెల్లాపూర్, ఈదుల నాగులపల్లి, వెలిమెల గ్రామాలు ఉంటాయి. ప్రధానంగా మాక్స్‌సొసైటీ కాలనీ, విద్యుత్‌నగర్, ఇక్రిశాట్ పెన్సింగ్ ఏరియా, పటాన్‌చెరులోని పలు కాలనీలు ఇక్రిశాట్‌కు ఆనుకుని ఉంటాయి. చిరుత చిక్కడంతో ఈ ప్రాంతాలకు చెందిన కాలనీవాసులు జన నివాసాల మధ్యలోకి చిరుతలు వచ్చే అవకాశం ఉండవచ్చని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పక్కనే రైల్వేస్టేషన్..
ఇక్రిశాట్ ఫెన్సింగ్‌ను ఆనుకునే రామచంద్రాపురం ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్ ఉంది. రాత్రి సమయంలో ఎంఎంటీఎస్ రైలు ఇక్కడనే ఉంచి తిరిగి ఉదయం బయల్దేరి వెళ్తుంది. రాత్రి సమయంలో ఎంఎంటీఎస్‌లో వచ్చే అవకాశం ఉంటుందా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఇక్రిశాట్‌లో మరొక చిరుత ఉందని మేము నిర్థారించ లేదు. కానీ, చిరుత కోసం ఏర్పాటు చేసిన ఆధునిక కెమెరాలను అలాగే ఉంచి పరిశీలిస్తున్నాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. –విజయ్ కుమార్,
రేంజ్ అధికారి, అటవీ శాఖ

వామ్మో... చిరుత!