
ట్రాక్టర్ బోల్తా : యువకుడు మృతి
అక్కన్నపేట(హుస్నాబాద్): ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి ఘటన అక్కన్నపేట మండలం పోతారం(జే) గ్రామంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన లింగాల భాను(23) వ్యవసాయ పనుల నిమిత్తం తన మామయ్య లింగాల యాదయ్య దగ్గర నుంచి ట్రాక్టర్ తీసుకెళ్లాడు. పనులు పూర్తి చేసిన అనంతరం తెల్లవారుజామున తీసుకొస్తుండగా గ్రామ శివారులో కల్వర్టు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో భాను ట్రాక్టర్ ఇంజన్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. జేసీబీ సాయంతో ట్రాక్టర్‌ను తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు. అందరితో కలివిడిగా ఉండే యువకుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
బైక్ ఢీకొని వ్యక్తి
టేక్మాల్ (మెదక్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మతి చెందిన ఘటన టేక్మాల్ మండల పరిధిలోని లక్ష్మణ్ తండాలో చోటుచేసుకుంది. ఏఎస్‌ఐ దయానంద్ కథనం మేరకు.. జోగిపేట– లక్ష్మీనగర్ రోడ్డుపై 14న తండాకు చెందిన కాట్రోత్ పోమ్లా నాయక్ (55) వడ్లు ఆరబోస్తుండగా అతివేగంగా బైక్ వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు అయ్యాయి. 108 సాయంతో మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధ వారం రాత్రి మృతి చెందాడు. మృతుడి తమ్ముడు బిక్యానాయక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
వైన్స్‌లోని పర్మిట్ రూమ్‌లో యువకుడు
జోగిపేట(అందోల్): వైన్స్‌లోని పర్మిట్ రూమ్‌లో యువకుడు మృతి చెందాడు. ఎస్‌ఐ పాండు కథనం మేరకు.. జోగిపేట పట్టణానికి చెందిన యాదుల్ (45) చౌరస్తాలోని టీ స్టాల్‌లో పనిచేస్తుంటాడు. బుధవారం మద్యం సేవించేందుకు మార్కెట్ యార్డు ఎదురుగా ఉన్న పద్మావతి వైన్స్‌కు వెళ్లాడు. అతిగా మద్యం సేవించి కూర్చున్నచోటే కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సీఐ అనిల్‌కుమార్, ఎస్‌ఐ పాండు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి భార్య ఫర్వీన్ బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
వడదెబ్బ లక్షణాలతో వృద్ధుడు?
రామాయంపేట(మెదక్): వడదెబ్బ లక్షణాలతో వృద్ధుడు మృతి చెందిన ఘటన రామాయంపేట పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. పట్టణానికి చెందిన ఎరుకల బాలయ్య(68) ప్రతిరోజూ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రెండు రోజులుగా అస్వస్థతకు గురై పనికి వెళ్లకుండా ఇంటివద్దే ఉంటున్నాడు. మంగళవారం రాత్రి వాంతులు చేసుకున్న బాలయ్యను ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. తన భర్త వడదెబ్బతోనే మృతి చెందినట్లు మృతుని భార్య తెలిపింది. సమాచారం అందుకుని వైద్యశాఖ అధికారులు మృతుడి ఇంటికెళ్లి వివరాలు సేకరించారు. వడదెబ్బతో మృతి చెందలేదని, అలాంటి లక్షణాలు లేవని పేర్కొన్నారు.

ట్రాక్టర్ బోల్తా : యువకుడు మృతి

ట్రాక్టర్ బోల్తా : యువకుడు మృతి