సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలకు ఇచ్చే క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో సంగారెడ్డి జిల్లా కందిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్ సత్తా చాటింది. బై సబ్జెక్ట్ 2025 లో ఐఐటీ హైదరాబాద్ ఆరు విభాగాలలో గ్లోబల్ గుర్తింపు సాధించింది. విస్తృతమైన విద్యా విభాగంలో, మొదటిసారిగా 501–510 శ్రేణిలో ర్యాంక్ పొందింది. మెటీరియల్స్ సైన్స్, ఎలక్ట్రికల్ – ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, మెకానికల్, ఏరోనాటికల్ – మానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, ఫిజిక్స్ – ఆస్ట్రోనమీ, కంప్యూటర్ సైన్స్ – ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ వంటి వాటిల్లో ర్యాంక్ లు వచ్చాయని ఐఐటీ వర్గాలు తెలిపాయి. 2008లో స్థాపించబడిన రెండవ తరం ఐఐటీల్లో హైదరాబాద్ ఐఐటీ ఒకటి. పరిశోధన, సాంకేతిక అభివృద్ధి, స్టార్టప్‌లలో ఈ ఉన్నత విద్యా సంస్థ దేశంలోనే ముందు వరుసలో ఉంటుంది. జాతీయస్థాయిలో ఇచ్చే ఎన్‌ఐఆర్‌ఎఫ్ –2024 ర్యాంకింగ్‌లో ఐఐటీ హైదరాబాద్ 3వ స్థానంలో నిలిచింది. అలాగే ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో 8వ స్థానంలో ఉంది. సుమారు 5,400 మంది యూజీ, పీజీ, పీహెచ్‌డీ స్కాలర్లు ఇందులో చదువుకుంటున్నారు. గతేడాది సుమారు 210 పేటెంట్లు సాధించిన ఈ విద్యా సంస్థలో సుమారు 260 స్టార్టప్‌లు ఆవిర్భవించాయి. తాజాగా ప్రపంచస్థాయి ర్యాకింగ్‌లోనూ ఈ ఉన్నత విద్యాసంస్థ తన సత్తాను చాటింది.