
సంఘటన స్థలంలో వివరాలు సేకరిస్తున్న పోలీసులు
భూతగాదాలతో దారుణ హత్య
ఝరాసంగం(జహీరాబాద్): భూవివాదంలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురైన సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం...ఝరాసంగం మండల పరిధిలోని బర్దీపూర్ గ్రామానికి చెందిన చంద్రయ్య(60) మంగళవారం గ్రామశివారులో పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా, తమ్ముడి కుమారుడు రాకేష్ పాతకక్షలు, భూతగాదాలు మనసులోకి ఉంచుకొని తన వద్ద ఉన్న కత్తితో నరికి చంపేశాడు. అంతటితో ఆగకుండా తలను గ్రామంలోకి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి ఝరాసంగం గ్రామ శివారులోని ఓ పెట్రోల్ పంపు వద్ద పడేశాడు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ వెంకటేశం, ఎస్‌ఐలు రాచేందర్‌రెడ్డి, వినయ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని హత్యకు వినియోగించిన కత్తిని సంఘటనస్థలం నుంచి స్వాధీనం చేసుకొని వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. మృతుడికి కుమారుడితో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హత్య చేసిన వ్యక్తి అదుపులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. తలను తీసుకుని గ్రామంలోకి రావటంతో గ్రామస్తులు తీవ్ర భయందోళనకు గురయ్యారు.