మెదక్‌జోన్: ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు జగదీష్ విమర్శించారు. రాహుల్‌గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దుకు నిరసనగా సోమవారం మెదక్ పోస్టాఫీస్ వద్ద కాంగ్రెస్ నాయకులు దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా జగదీష్ మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీ జోడో యాత్రకు దేశవ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారని.. అది చూసి ప్రధాని మోదీ భయపడి కుట్ర చేస్తున్నాడని మండిపడ్డారు. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ.. ఈడీ, సీబీఐని అడ్డుపెట్టుకుని మోదీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని అన్నారు. దేశ సంపదను అదానీకి దోచిపెడుతున్నారని రాహుల్‌గాంధీ ప్రశ్నించడంతో కక్షగట్టి పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేశారన్నారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తే సహించమని హెచ్చరించారు.
టీపీసీసీ ఉపాధ్యక్షుడు జగదీష్