‘సోషల్‌ మీడియా’ మత్తును వదిలించుకోవచ్చు.. వాసిరెడ్డి అమర్‌నాథ్ సూచనలు ఇవే..

Vasireddy Amarnath Comments On Social Media Deaddiction - Sakshi

విదేశాల్లో పెరుగుతున్న సోషల్‌ మీడియా డి–అడిక్షన్‌ సెంటర్లు 

గంటల తరబడి సైట్లకే అతుక్కుపోతున్న యూజర్లు 

హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టుకు రిప్లయ్‌ ఇవ్వలేదని తను ప్రేమించిన  యువతిపైనే బహిరంగంగా దాడి చేశాడు. ఈ గొడవ పోలీస్‌ స్టేషన్‌ వరకు వెళ్లింది. సోషల్‌ మీడియా కారణంగా జరుగుతున్న ఇలాంటి ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. రోజుకు 2.30 గంటలకు మించి సోషల్‌ మీడియా సైట్లలో గడిపేవారిలో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయని, వారు మరో పనిపై మనసు నిమగ్నం చేయలేకపోతున్నారని చికాగో యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. ఇలాంటి వారు తమ చదువు, వృత్తి కోసం కేటాయించిన సమయాన్ని కూడా వృథా చేసుకుంటున్నట్టు గుర్తించారు.  

సాక్షి, అమరావతి: స్మార్ట్‌ఫోన్‌లో నెట్‌ రాకుంటే చిరాకు.. గంటపాటు సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలంటే విసుగు.. పోస్టులకు లైక్‌లు, షేర్‌లు చేస్తూ కామెంట్లకు రిప్లయ్‌ ఇవ్వాలన్న కోరిక.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటే అదో మానసిక వ్యసనమే అంటున్నారు మానసిక వైద్యులు. ఇది మద్యపాన, మత్తు పదార్థాలు తీసుకోవడం వంటిదేనంటున్నా రు. ఈ వ్యసనంపై చికాగో యూనివర్సిటీ ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనం చేసింది. 

మన దేశంలోనూ ఇలాంటి కేసులు పెరుగుతున్నట్టు తేల్చింది. ఆన్‌లైన్‌లో విహరించేవారి మెదడులో డోపమైన్‌ అనే హార్మోన్‌ ఎక్కువ విడుదలవుతుందని, చేస్తున్న పని పదేపదే చేసేలే ఆ హార్మోన్‌ ఉత్తేజపరుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్లనే ఒక్కసారి సో షల్‌ మీడియా సైట్లకు అలవాటుపడ్డవారు వదలలేకపోతున్నారు. ఇది ఒకస్థాయి వరకు ఇబ్బంది లేకున్నా పరిమితి మించినప్పుడు అనర్థాలకు దారితీస్తున్నట్టు గుర్తించిన సైంటిస్టులు.. అలాంటివారు మానసిక వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.  

వెనకకు వెళ్తేనే.. ముందుకు 
ఆన్‌లైన్‌ సెర్చింగ్‌ వ్యసనం మానసిక రోగమని ఇప్పటిదాకా ప్రపంచంలో ఎవరూ ప్రకటించకున్నా వీరికి చికిత్స అందించే థెరపిస్టులు మాత్రం పెరుగుతున్నారు. అమెరికాలో సోషల్‌ మీడియా వ్యసనం 20 శాతానికి పెరిగినట్టు గుర్తించారు. మన దేశంలోనూ ఈ సంఖ్య 4.7 శాతంగా ఉండగా, ఇది వచ్చే రెండేళ్లలో మూడింతలవుతుందని అంచనా వేస్తున్నారు. కోవిడ్‌ తర్వాత పిల్లల్లో స్మార్ట్‌ఫోన్ల వినియోగం అధికమైంది. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా గడుపుతున్న ఇలాంటి పిల్లలను తల్లిదండ్రులు సైకియాట్రిస్టులకు చూపిస్తున్నారు. సామాజిక మాధ్యమం వ్యసనానికి చికిత్స కోసం అమెరికా, యూకేల్లో డి–అడిక్షన్‌ సెంటర్లు పుట్టుకొచ్చాయి. కాలిఫోర్నియా న్యూపోర్టు బీచ్‌లోని మీడియా సైకాలజీ రీసెర్చ్‌ సెంటర్‌లో డ్రైవింగ్, స్విమ్మింగ్‌తో చికిత్స అందిస్తున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే సోషల్‌ మీడియాకు ముందున్న పరిస్థితికి వెళ్లాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. ఫోన్‌ ను పక్కనబెట్టి మానవ సంబంధాలను మెరుగుపరచుకోవడం, సన్నిహితులతో ఎక్కువ సమయం గడపడం అలవాటు చేసుకోవాలంటున్నారు.   

ప్రత్యేక కోర్సు డిజైన్‌ చేశాం..  
స్మార్ట్‌ఫోన్‌ వ్యసనం టీనేజ్‌ పిల్లల్లో అధికంగా కనిపిస్తోంది. అదికూడా ఇంట్లో పెద్దవారే అలవాటు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ నుంచి మరీ ఎక్కువైంది. చాలామంది పిల్లలు స్మార్ట్‌ఫోన్‌ వాడే అవకాశం ఉండదని స్కూళ్లకు కూడా వెళ్లడం లేదు. నావద్దకు వచ్చే పిల్లల్లో కొందరు 7 గంటలకు పైగా స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నవారున్నారు. పిల్లల్లో కార్పెల్‌ టెన్నల్‌ సిండ్రోమ్‌తో మణికట్టు దెబ్బతింటుంది. అధిక సమయం తలను వంచి ఉంచడం వల్ల డ్రూపింగ్‌ హెడ్‌ సిండ్రోమ్‌ వస్తోంది. ఇటీవల పిల్లల్లో కొత్తగా వర్చువల్‌ ఆటిజం గుర్తించారు. గత పదేళ్లలో అమెరికాలో ఏడీహెచ్‌డీ బారిన పడుతున్న పిల్లలు పెరుగుతున్నారు. అంటే ఏకాగ్రత తగ్గిపోతోంది. హింసాతత్వం పెరుగుతోంది. భావోద్వేగాలను అదుపుచేసుకోలేకపోతున్నారు. స్కూల్‌ పిల్లలను స్మార్ట్‌ఫోన్‌ నుంచి దూరంగా ఉంచేందుకు ప్రత్యేక ప్రోగ్రామ్‌ డిజైన్‌ చేసి పిల్లలకు చూపిస్తున్నాం. దీనివల్ల ప్రైమరీ పిల్లల్లో నూరు శాతం మార్పు వచ్చింది. హైస్కూల్‌ స్థాయి పిల్లల్లో కొందరు తీవ్రంగా ఫోన్‌కు బానిసలుగా మారిపోయారు. అలాంటి వారిని సైకియాట్రిస్టులకు చూపించాలని తల్లిదండ్రులకు సిఫారసు చేస్తున్నాం.  
– వాసిరెడ్డి అమర్‌నాథ్, విద్యావేత్త.

తగ్గించుకునే మార్గాలూ ఉన్నాయ్‌ 
వ్యక్తిగత, మానసిక ఆరోగ్యం మీద, మానవ సంబంధాలపైనా తీవ్ర ప్రభావం చూపుతున్న సోషల్‌ మీడియా వ్యసనాన్ని సులువుగా తగ్గించుకోవచ్చని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్నారు.  

- మొదట మన స్మార్ట్‌ ఫోన్‌లో అతిగా వినియోగిస్తున్న యాప్స్‌ను డిలీట్‌ చేయడం ఉత్తమ మార్గం.  
- పని సమయంలో, భోజనం, వినోద కార్యక్రమాల సమయాల్లో ఫోన్‌ను ఆఫ్‌ చేయాలి. 
- సోషల్‌ మీడియా యాప్స్‌లోని నోటిఫికేషన్‌ సెట్టింగ్స్‌ను ఆఫ్‌ చేయాలి.  
- పడకగదిలో ఫోన్, టాబ్లెట్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లను ఉంచకూడదు.  
- సాంకేతికతతో సంబంధం లేని కొత్త అభిరుచిని అలవాటు చేసుకోవాలి.  
- సాధ్యమైనప్పుడుల్లా స్నేహితులు, కుటుంబ సభ్యులను కలిసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి.  

Read latest Sakshi Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top