దీర్ఘకాలిక డిజిటల్‌ ప్రమాదం

Sakshi Editorial On Chronic digital risk

కళ్ళ ముందు జరుగుతున్నవి సైతం మరెవరో శాస్త్రీయ సర్వేలతో బలంగా చెబితే మనసుకు ఎక్కుతాయి. ప్రతి చిన్నారి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ కనిపిస్తున్న ఈ రోజుల్లో వాటి ప్రభావం ఎలా ఉంటుందన్న విషయం అలాంటిదే. ఏ వయసులో పిల్లలకు తొలిసారిగా స్మార్ట్‌ఫోన్, ట్యాబ్‌ అలవాటైందనే దాన్ని బట్టి పెద్దయ్యాక వారి మానసిక ఆరోగ్యం ఉంటుందన్న తాజా నిర్ధారణ అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది. అమెరికాకు చెందిన సేపియన్‌ ల్యాబ్స్‌ సంస్థ సరికొత్త ప్రపంచ సర్వే ఈ కఠిన వాస్తవాన్ని కళ్ళ ముందుంచింది.

పరిమితి దాటిన డిజిటల్‌ స్క్రీన్‌టైమ్, పగ్గాలు లేని సోషల్‌ మీడియా వినియోగం వల్ల ఒంటరితనం, బాధ, కోపం, చివరకు ఆత్మహత్యను ప్రేరేపిస్తున్న ఆలోచనలు సైతం పెరుగుతున్నాయని ఇప్పటికే అనేక పరిశోధనలు, అధ్యయనాలు తేల్చాయి. తాజా సర్వే సైతం ఈ దీర్ఘకాలిక డిజిటల్‌ ప్రమాదాన్ని ప్రపంచం ముందుకు తెచ్చింది. 

పిల్లలు కళ్ళప్పగించి చూస్తున్న డిజిటల్‌ తెరలు కంటికే కాదు... పెద్దయ్యే కొద్దీ మనసుకూ చేటు చేస్తున్నాయని సర్వే చేసి ఈ సంస్థ తేల్చింది. ప్రస్తుతం 18 నుంచి 24 ఏళ్ళ వయసులో ఉన్న 28 వేల మంది పాలుపంచుకున్న ఈ సర్వే ప్రకారం మగవారి కన్నా ఆడవారిపై ఈ దుష్ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. చిన్నప్పుడే డిజిటల్‌ తెరలకు అలవాటు పడ్డవారు ఎదుగుతున్న కొద్దీ విషయ గ్రహణ శక్తి తగ్గి, సామాజిక అలవాట్లు మారుతున్నాయి.

‘ఏజ్‌ ఆఫ్‌ ఫస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ అండ్‌ మెంటల్‌ వెల్‌బీయింగ్‌ అవుట్‌కమ్స్‌’ అనే శీర్షికన వెలువడ్డ ఈ అధ్యయన సారాంశం ఒకటే – స్మార్ట్‌ఫోన్ల వాడకం ఎంత నిదానిస్తే, పిల్లల మానసిక ఆరోగ్యం అంత మెరుగ్గా ఉంటుంది. లేదంటే, భ్రమల్లో బతకడం, దుడుకుగా వ్యవహరించడం, ఆత్మహత్య ఆలోచనల లాంటివి హెచ్చుతాయి. దక్షిణా సియా సహా అనేక ప్రాంతాల్లో పరిస్థితి ఇదేనట. అంటే, భారత్‌కూ ఇదే వర్తిస్తుంది. 

ఇరవై కోట్ల మందికి పైగా 15 నుంచి 25 ఏళ్ళ మధ్యవారున్న దేశంలో పాఠశాలల నుంచి పని ప్రదేశాల దాకా అన్నిచోట్లా ప్రభావం చూపే అంశమిది. అందుకనే ఆకలి, దారిద్య్రం, నిరుద్యోగం లాంటి అంశాలతో పాటు స్మార్ట్‌ఫోన్ల వినియోగానికి అనుమతించే వయసుపైనా దృష్టి పెట్టాలని ఓ వాదన. భారత్‌లో నూటికి 94 ఇళ్ళలో కనీసం ఒక మొబైల్‌ ఫోన్‌ ఉందని 2019– 21 నాటి ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’. కరోనా అనంతరం ఫోన్లతో పాటు ఇంటర్నెట్‌ వినియోగమూ పెరిగింది.

పిల్లలు డిజిటల్‌ స్క్రీన్లు చూసే సమయం కరోనా కాలానికి ముందుతో పోలిస్తే, రెట్టింపు దాటింది. 2020 – 2022 మధ్య 12 నుంచి 18 ఏళ్ళ లోపు పిల్లల స్క్రీన్‌టైమ్‌ 52 శాతం పెరిగిందని గత నవంబర్‌లో ఓ నివేదిక తేల్చింది. మానసిక ఆరోగ్య అధ్యయనాలు అవసరమంటున్నది అందుకే. 

పొరుగునే ఉన్న పాకిస్తాన్‌లో నూటికి 80 మంది యువత సగటున రోజుకు ఆరు గంటలు డిజిటల్‌ పరికరాలతో గడుపుతూ, స్క్రీన్‌కు బానిసవుతోందని పాకిస్తాన్‌ టెలికమ్యూనికేషన్‌ అథారిటీ తాజా అధ్యయనం. కరోనా తర్వాత జీవితం క్రమంగా సాధారణ స్థితికి చేరుకున్నా, పెరిగిన ఈ స్క్రీన్‌టైమ్‌ భారత్‌ సహా అన్నిచోట్లా ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. ఒకసారి ఎక్కువ సమయం డిజిటల్‌ పరికరాలను వాడడం అలవాటయ్యాక ఇక ఆ వీక్షణ సమయమే ఆ వ్యక్తి ‘కనీస పరిధి’గా మారుతుంది.

కరోనా రెండేళ్ళలో ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితుల్లో పిల్లలకు ఆటాపాటా, ఆన్‌లైన్‌ చదువులూ అంతా డిజిటల్‌ పరికరాలే. అలా జీవితంలో అదనపు భాగమైన స్క్రీన్‌టైమే చివరకు అత్యవసర భాగమైపోయింది. స్క్రీన్‌టైమ్‌కీ, మానసిక ఒత్తిడి, ఆందోళనలకూ లంకె ఉందని నిపుణులు ఎప్పుడో తేల్చారు. మితిమీరిన స్క్రీన్‌టైమ్‌తో శారీరకంగా, మానసికంగా అలసిపోయి, పిల్లల మానసిక స్థితి దెబ్బతింటుంది. ఏదైనా అంశంపై ఏకాగ్ర దృష్టి పెట్టి, నేర్చుకొనే సామర్థ్యం తగ్గుతుంది. పడుకొనే ముందు స్క్రీన్‌లో చూసినవి కలత నిద్రకూ కారణమవుతున్నాయి.  

భారీ టెక్‌సంస్థలకూ ఈ డిజిటల్‌ దుష్ప్రభావాల గురించి తెలుసు. డిజిటల్‌ తెరలకు అతుక్కు పోయి, సోషల్‌ మీడియాకు బానిసలైతే ఆరోగ్యం చెడుతుందన్న సంగతి సాక్షాత్తూ ఫేస్‌బుక్‌ సొంత రీసెర్చ్‌లోనే తేలింది. ఇన్‌స్టాగ్రామ్‌ వ్యసనంగా మారిన టీనేజ్‌ అమ్మాయిలు మానసిక ఆరోగ్యం పాలయ్యారు. 2021లోనే ప్రసిద్ధ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఆ సంగతి పేర్కొంది.

కానీ, జనంలో చైతన్యం పెంచడానికి ఆ సంస్థలు చేస్తున్నది శూన్యం. లాభాపేక్షే ధ్యేయమైన వ్యాపారాన్ని పణంగా పెట్టి, అవి అలా ముందుకొస్తాయనుకోవడం అమాయకత్వమే. చిన్నప్పుడే ఫోన్లు చేతికివ్వడమంటే, చేతులారా డిజిటల్‌ మత్తుమందుకు బానిసల్ని చేసినట్టే! మారాం చేస్తున్న పిల్లల్ని ఆపడానికీ, ఆడుకో వడానికీ వీడియో గేమ్స్, స్మార్ట్‌ఫోన్లు అలవాటు చేసే బుద్ధిహీనతను వదిలించుకోవడం మన చేతిలో పనే! 

తల్లితండ్రులే మొదటి గురువులు గనక వారు డిజిటల్‌ వినియోగాన్ని నియంత్రించుకుంటే, అదే పిల్లలకూ మార్గదర్శకమవుతుంది. ఇంట్లో అందరూ కలసి మాట్లాడుకుంటూ, మమతానురాగాలు పంచుకోవడం అనేక సమస్యలకు పరిష్కారం. మారుతున్న కాలంలో డిజిటల్‌ స్క్రీన్లతో సంపర్కం అనివార్యమని గ్రహిస్తూనే ఎంతసేపు, ఎలాంటివి చూస్తూ, ఎవరితో డిజిటల్‌ స్నేహాలు చేస్తున్నామ నేది ముఖ్యం. ఈ అంశాల్ని తల్లితండ్రులు, బడిలో గురువులు గమనించి, మంచి మాటలతో పిల్లల్ని వర్చ్యువల్‌ లోకం నుంచి వాస్తవ ప్రపంచంలోకి మరల్చాలి.

సురక్షితంగా, సమర్థంగా సాంకేతికతను వాడడడం ఎలాగో నేర్పాలి. పుస్తక పఠనం, ఆటల లాంటి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్స హించాలి. లేదంటే, ఇప్పటికే బస్సుల్లో, రైళ్ళలో సహా అన్నిచోట్లా పక్కనేం జరుగుతున్నా పట్టకుండా స్మార్ట్‌ఫోన్లు చూసుకుంటూ వేరే ప్రపంచంలో విహరిస్తున్న మనుషులు నిండిన సమాజం దుర్భరం. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top