
విమానయాన సంస్థల్లో సిబ్బంది కొరత!
డీజీసీఏ, బీసీఏఎస్, ఏఏఐలో పెద్దఎత్తున ఖాళీలు
సిబ్బంది కొరతను గుర్తించిన పార్లమెంటరీ కమిటీ
నియామకాలు, ఆర్థిక దిద్దుబాట్లు చేపట్టాలని సూచన
ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం భారతీయులను ఉలిక్కిపడేలా చేసింది. 275 మంది ప్రాణాలను బలి తీసుకున్న ఘోర దుర్ఘటన ఇది. ఈ నేపథ్యంలో మనదేశంలో విమానయాన నిబంధనలు, భద్రతపై అందరూ చర్చించుకుంటున్నారు. విమానయానంతో ముడిపడి ఉన్న ప్రభుత్వ కీలక సంస్థల పనితీరుపైనా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషాదానికి మూడు నెలల ముందు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్), ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వంటి విమానయాన సంస్థలలో దీర్ఘకాలంగా సిబ్బంది కొరత ఉందని ఇటీవల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక వెల్లడించింది. అత్యంత కీలక విభాగాలైన ఈ మూడు సంస్థల్లో 2025 మార్చి నాటికి 10,500లకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ).. ప్రధానంగా భద్రతా సమస్యలను పర్యవేక్షిస్తుంది. దేశీయంగా, అలాగే భారత్‌కు రాకపోకలు సాగించే విమాన రవాణా సేవలను నియంత్రించడం, పౌర విమానయాన నిబంధనలు, ప్రమాణాల అమలుకు ఇది బాధ్యత వహిస్తుంది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థతో (ఐసీఏఓ) అన్ని నియంత్రణ విధులను సమన్వయం చేస్తుంది. ఇలాంటి డీజీసీఏలో ఖాళీల సంఖ్య 2021తో పోలిస్తే రెట్టింపు అయింది. 2021–25 మధ్య డీజీసీఏకు మంజూరైన ఉద్యోగుల సంఖ్య 1,233 నుంచి 1,692కి పెరిగింది. అయినప్పటికీ 2025 మార్చి నాటికి కేవలం 878 మాత్రమే భర్తీ అయ్యాయి. విమానాశ్రయ భద్రతకు బాధ్యత వహించే బీసీఏఎస్‌కు 598 మంది సిబ్బందిని మంజూరు చేయగా అది 374 మంది సిబ్బందితో నెట్టుకొస్తోంది. ఏఏఐలోనూ మంజూరైన 25,730 పోస్టుల్లో 9,500కుపైగా ఖాళీలు ఉన్నాయి.
‘ప్రమాణాలకు దెబ్బ’
దీర్ఘకాలిక సిబ్బంది కొరత.. విమానయాన రంగంలో నియంత్రణ పరంగా పర్యవేక్షణ, ప్రయాణికుల భద్రతను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని పార్లమెంటరీ కమిటీ హెచ్చరించింది. ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో ఈ సంస్థలలో దీర్ఘకాలిక సిబ్బంది కొరత భద్రత, సేవా ప్రమాణాలను దెబ్బతీస్తుందని పేర్కొంది. డీజీసీఏ రెండేళ్లలో 49 మందిని మాత్రమే కొత్తగా చేర్చుకుంది. బీసీఏఎస్ గత ఏడాది 139, ప్రస్తుత సంవత్సరం కేవలం ఐదు పోస్టులను మాత్రమే భర్తీ చేసింది. 2022లో 952 మందిని నియమించుకున్న ఏఏఐ.. ఈ ఏడాది 15 మందికే ఉద్యోగావకాశాలు కల్పించింది.
కాంట్రాక్ట్ పద్ధతిలో..
సిబ్బంది కొరతను అధిగమించడానికి ఏఏఐ 1,098 మంది ఎగ్జిక్యూటివ్ స్థాయి సిబ్బందిని నియమించాలని యోచిస్తోంది. 2025 ఆగస్టు–నవంబర్ మధ్య మూడు దశల్లో నియామకాలు చేపట్టనుంది. సాధారణ నియామకాలలో జాప్యాలను నివారించడానికి డీజీసీఏ, బీసీఏఎస్ కాంట్రాక్టు నియామకాలకు నడుం బిగించాయి. ఈ ఏడాది డీజీసీఏ 107 మంది కన్సల్టెంట్లు, ఫ్లైట్ ఆపరేషన్ ్స ఇన్ స్పెక్టర్లను నియమించుకుంది. అలాగే బీసీఏఎస్ 14 మంది కన్సల్టెంట్లను చేర్చుకుంది.
తగ్గిన నిధులు..
దేశంలో విమానయాన నెట్‌వర్క్ వేగంగా విస్తరిస్తున్న సమయంలో ఈ రంగంలో మూలధన వ్యయం కూడా తగ్గుతోంది. పౌర విమానయానానికి మూలధన వ్యయం 2023–24లో రూ.755.18 కోట్లు కేటాయిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.70 కోట్లకు పరిమితమైంది. ఇందులో డీజీసీఏకు రూ.30 కోట్లు, బీసీఏఎస్ రూ.15 కోట్లు, ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకు (ఏఏఐబీ) రూ.20 కోట్లు మాత్రమే కేటాయించారు. ఉడాన్ వంటి పథకాల కింద మౌలిక సదుపాయాలు పెరుగుతున్నప్పటికీ.. ప్రమాద దర్యాప్తు, విమానయాన భద్రతకు నిధులు తక్కువగా ఉండడం ఆందోళన కలిగించే అంశం.
‘ఉడాన్ ’కు తగ్గట్టుగా..
సామాన్యులకూ విమానయానం అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో 2016లో ఉడాన్ పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మారుమూల ప్రాంతాలను పెద్ద నగరాలతో అనుసంధానించడం ద్వారా విమాన ప్రయాణాన్ని సరసమైనదిగా, విస్తృతంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం 619 మార్గాల్లో విమాన రాకపోకలు సాగుతున్నాయి. ప్రయాణికుల సంఖ్య పెరగడం, చిన్న నగరాలకూ ఈ రంగం విస్తరిస్తున్నందున అత్యవసర సిబ్బంది నియామకాల వంటివి చేపట్టాలని పార్లమెంటరీ కమిటీ ప్రభుత్వానికి సూచించింది.
బీసీఏఎస్: దేశంలోని విమానాశ్రయాలలో పౌర విమానాల భద్రత ప్రమాణాలు, చర్యలను నిర్దేశించడం దీని ప్రధాన బాధ్యత. భద్రతా నియమాలు, నిబంధనల అమలును పర్యవేక్షించడం, భద్రతా అవసరాలపై సర్వే నిర్వహించడం; భద్రతా నియంత్రణలను అమలు చేసే వ్యక్తులు తగిన శిక్షణ పొందారని, విధులను నిర్వర్తించడానికి అవసరమైన అన్ని సామర్థ్యాలను కలిగి ఉన్నారని నిర్ధారించుకోవడం; విమానయాన భద్రతా విషయాల ప్రణాళిక, సమన్వయం; భద్రతా సిబ్బంది వృత్తిపరమైన సామర్థ్యం, అప్రమత్తతను పరీక్షించడానికి ఆకస్మిక తనిఖీలు, మాక్ డ్రిల్స్ నిర్వహిస్తుంది.
ఏఏఐ: దేశంలోని మొత్తం విమానాశ్రయాల నిర్వహణ ఇదే చూస్తుంది. ఎయిర్‌పోర్టుల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా టెర్మినల్, కార్గో సౌకర్యాల సమగ్ర అభివృద్ధి, విస్తరణ, ఆధునికీకరణ పనులను చేపడుతుంది. ఐసీఏఓ ఆమోదించిన విధంగా దేశ ప్రాదేశిక పరిమితులకు మించి విస్తరించి ఉన్న భారత వైమానిక ప్రాంతం నియంత్రణ, నిర్వహణ బాధ్యతలూ ఈ సంస్థవే.