నేటి నుంచి ‘తీన్’మార్
పకడ్బందీగా ఏర్పాట్లు
● మూడో విడత నామినేషన్ల పర్వం
● ఇబ్రహీంపట్నం, కందుకూరు డివిజన్లలో సందడి
ఇబ్రహీంపట్నం: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడత నామినేషన్ల పర్వం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల్లో 14 పంచాయతీల చొప్పున ఉండగా, యాచారం మండలంలో 24, మంచాల మండలంలో 23, మాడ్గుల మండలంలో 34 పంచాయతీలున్నాయి. కందుకూరు డివిజన్ పరిధిలోని మహేశ్వరం మండలంలో 30, కందుకూరు మండలంలో 35 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. పోటీ చేసే ఆశావహులు ఆయా క్లస్టర్లలో తమ నామినేషన్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. 17న పోలింగ్ అనంతరం ఆయా గ్రామ పంచాయతీల వద్దనే ఓట్ల లెక్కింపు చేపడతారు.
మూడో విడత జరగనున్న పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఏ పంచాయతీ ఏ క్లస్టర్‌లో ఉంటే అక్కడే సర్పంచ్‌లకు, వార్డులకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాలి. ఎన్నికల నిబంధనలు, కోడ్‌ను తప్పక పాటించాలి. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. శాంతియుతంగా, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు అభ్యర్థులు, ఆయా రాజకీయ పక్షాలు, ప్రజలు సహకరించాలి
– అనంతరెడ్డి, ఆర్డీఓ, ఇబ్రహీంపట్నం
నేటి నుంచి ‘తీన్’మార్


