‘రెండు’లో చివరి రోజు జోరు
● రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల స్వీకరణ
● పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభ్యర్థులు
చేవెళ్ల: రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఘట్టం మంగళవారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో రావడంతో సాయంత్రం 5 దాటిన తరువాత కూడా నామినేషన్ల పర్వం కొనసాగింది. కేంద్రాల వద్ద టోకెన్లు ఇచ్చి కూలైన్‌లో నిలబెట్టారు. చివరి రోజున సర్పంచ్ స్థానాలకు 300, వార్డు సభ్యులకు 1,261 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. చేవెళ్లలో సర్పంచులకు 75, వార్డు సభ్యులకు 267, శంకర్‌పల్లిలో సర్పంచులకు 46, వార్డు సభ్యులకు 202, మొయినాబాద్‌లో సర్పంచులకు 64, వార్డు సభ్యులకు 339, షాబాద్‌లో సర్పంచులకు 117, వార్డు సభ్యులకు 453 నామినేషన్లు వచ్చాయి.
కందుకూరు డివిజన్‌లో..
ఆమనగల్లు: కందుకూరు డివిజన్‌లోని ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి మండలాలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మండలంలోని కోనాపూర్ కేంద్రంలో సమయం ముగిసినప్పటికీ నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన వారికి సీరియల్ నంబర్ ఇచ్చి సాయంత్రం 7 గంటల వరకు స్వీకరించారు. ఆమనగల్లు మండలంలో సర్పంచ్ పదవులకు 49, వార్డు సభ్యులకు 228 నామినేషన్లు వచ్చాయి. తలకొండపల్లి మండలంలో సర్పంచ్‌లకు 116, వార్డు సభ్యులకు 441 నామినేషన్లు వచ్చాయి. కడ్తాల్ మండలంలో సర్పంచ్ పదవులకు 75, వార్డు సభ్యులకు 387నామినేషన్లు దాఖలయ్యాయి.


