పొరపాట్లకు తావివ్వొద్దు
ఇబ్రహీంపట్నం రూరల్: ఎలాంటి పొరపాట్లు లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మంగళవారం పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించారు. ఎన్నికల పరిశీలకుడు ప్రశాంత్ జీవన్ పాటిల్, కలెక్టర్ నారాయణరెడ్డి నిశితంగా పరిశీలించారు. రెవెన్యూ డివిజన్లలోని ఒక్కో మండలం వారీగా ఆయా పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించినట్లు తెలిపారు. స్థానికత, విధులు నిర్వర్తిస్తున్న మండలం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని స్థానికేతర సిబ్బందిని విధుల కోసం ఎంపిక చేసినట్లు చెప్పారు. ప్రిసైడింగ్ అధికారులు అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీపీఓ సురేష్ మోహన్, నోడల్ అధికారి శ్రీలక్ష్మి, పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
పక్కాగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి


