బరిలో మిగిలేదెవరో!
గ్రామ పంచాయతీలు 174 , వార్డులు 1,530
సర్పంచ్ కోసం దాఖలైన నామినేషన్లు – 846
వార్డు కోసం దాఖలైన నామినేషన్లు – 4,123
షాద్‌నగర్: డిసెంబర్ 3.. సరిగ్గా 3 గంటల సమయం.. అప్పటిదాకా ఆలోచించుకోవాల్సిన తరుణం.. బరిలో ఉంటారా.. తప్పుకొంటారా.. తొలి విడత పంచాయతీ ఎన్నికల ఉపసంహరణకు బుధవారం మూడు గంటలలోపు గడువు ముగియనుంది. పోటీలో తమకు అడ్డుగా ఉన్న వారిని తప్పించే ఆఖరి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
అందరిలో ఉత్కంఠ
షాద్‌నగర్ పరిధిలోని కొత్తూరు, నందిగామ, ఫరూఖ్‌నగర్, కేశంపేట, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ, రాజేంద్రనగర్ పరిధిలోని శంషాబాద్ మండలాల్లో తొలివిడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అప్పీళ్ల పర్వం ముగిసింది. బరిలో నిలిచే అభ్యర్థులెవరో.. తప్పుకొనేదెవరో బుధవారంతో తేలిపోనుంది. సర్పంచ్, వార్డులకు ఎవరు బరిలో నిలుస్తారోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది.
పెరుగుతున్న ఒత్తిడి
రెబల్స్‌గా బరిలో దిగిన వారిని నామినేషన్లు ఉపసంహరించుకోవాలని ఆయా పార్టీల నేతలు ఒత్తిడి చేస్తున్నారు. తాయిలాలు ఇచ్చి పోటీ నుంచి తప్పించేందుకు చివరి ప్రయత్నాలు సాగిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ప్రత్యర్థులను తప్పించి ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
తెలుగు అక్షర క్రమంలో గుర్తుల కేటాయింపు
మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థులను అధికారులు ప్రకటించనున్నారు. వెంటనే వారికి గుర్తులను కేటాయిస్తారు. రాజకీయ పార్టీల గుర్తులు లేకుండా ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో అభ్యర్థుల పేర్లలో తెలుగు అక్షర క్రమంలో గుర్తులు కేటాయింపు ఉండనుంది. నామినేషన్ పత్రాల్లో పేర్లు ఎలా రాసారో అలాగే తెలుగు అక్షరాల క్రమాన్ని గుర్తిస్తారు. కొందరు తమ ఇంటి పేరును ముందుగా, మరికొందరు చివరగా రాస్తారు. ఏ పేరు ముందు ఉంటుందో దాని తెలుగు అక్షరం ఆధారంగా గుర్తులు కేటాయిస్తారు.
నిలిచేదెవరో.. తప్పుకొనేదెవరో
కీలక ఘట్టానికి చేరిన తొలి విడత ఎన్నికలు
నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ
తేలిపోనున్న ఫైనల్ అభ్యర్థుల జాబితా


