పొరపాట్లకు తావివ్వొద్దు
● గ్లోబల్ సమ్మిట్ పనులను పక్కాగా పూర్తి చేయాలి
● కలెక్టర్ నారాయణరెడ్డి
కందుకూరు: ఫ్యూచర్‌సిటీలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ పనులను ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. మీర్‌ఖాన్‌పేట రెవెన్యూలో గ్లోబల్ సమ్మిట్ కోసం చేపట్టిన ఏర్పాట్లను శనివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అంతకుముందు ఆయన విమానాశ్రయం నుంచి వచ్చే రహదారితో పాటు గ్లోబల్ సమ్మిట్‌కు వచ్చే శ్రీశైలం రహదారిని పర్యవేక్షించారు. వివిధ దేశాల నుంచి అతిథులు వస్తున్న నేపథ్యంలో విమానాశ్రయం నుంచి గ్లోబల్ సమ్మిట్ నిర్వహించే ప్రాంతం వరకు రోడ్లు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. సమ్మిట్ జరిగే ప్రాంతంలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, చెత్తను ఎప్పటికప్పుడు తరలించాలని సూచించారు. రోడ్లపై గుంతలు లేకుండా, నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ విధులు బాధ్యతతో నిర్వర్తించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, ఆర్ అండ్ బీ అధికారులు, నేషనల్ హైవే అధికారులు పాల్గొన్నారు.


