పెరగనున్న జీహెచ్‌ఎంసీ పరిధి
సాక్షి, సిటీబ్యూరో: శివార్లలోని 27 మున్సిపాలిటీల విలీనంతో పెరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్ని జోన్లు కానుంది? ప్రస్తుతమున్న 150 వార్డులు (కార్పొరే టర్ల డివిజన్లు) ఎన్ని వార్డులు కానున్నాయి? 30 సర్కిళ్లను ఎన్ని సర్కిళ్లకు పెంచుతారు? అన్నది చర్చనీయాంశంగా మారింది. వార్డుకు సగటు జనాభా/ఓటర్లను నిర్ణయించి అందుకనుగుణంగా వార్డులను పునర్వ్యవస్థీకరించనున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీసీఎల్‌లో కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ వార్డుల్లో జనాభా మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. కొన్ని వార్డుల్లో 30 వేల జనాభా ఉంటే కొన్ని వార్డుల్లో లక్ష జనాభా ఉంది. దీంతో పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఉదాహరణకు ఇటీవలే జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లకు రూ.2 కోట్ల వంతున నిధులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. 30 వేల జనాభా ఉన్న వార్డులకు అవి సరిపోయినా లక్ష జనాభా ఉన్న వార్డులకు సరిపోవు. ఇలాంటి ఇబ్బందుల్లేకుండా సగటు జనాభా ప్రాతిపదికన వార్డుల్ని పునర్వ్యవస్థీకరించను న్నారు. అంతేకాదు, అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ స్థానాల సరిహద్దుల్ని సైతం పరిగణనలోకి తీసుకోనున్నారు. వీటితో పాటు జిల్లాల భౌగోళిక సరిహద్దుల్లోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సీఎం ఇప్పటికే ఆదేశించారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతమున్న 6 జోన్లు అందుకు రెట్టింపు 12 కానీ, లేదా 10 కానీ అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అలాగే వార్డులు కూడా 150 నుంచి 300కు పెరుగుతాయనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న సర్కిళ్లు సైతం 50 లేదా 60 వరకు ఉండే అవకాశం ఉంది.
జీహెచ్‌ఎంసీ ప్రస్తుత జనాభా దాదాపు: 1,45,15,600
విలీన మున్సిపాలిటీల జనాభా దాదాపు: 20,17,000
విలీనంతో జీహెచ్‌ఎంసీ మొత్తం జనాభా: 1,65,32,600
శివారు మున్సిపాలిటీల విలీనంతో..
డివిజన్‌కు సగటున 55 వేల జనాభా ఉండేలా చేయాలనుకుంటే 300 వార్డులుగా విభజించనున్నారు. ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య తగ్గే అవకాశం ఉంది. జీహెచ్‌ఎంసీని ఎన్నికార్పొరేషన్లు చేస్తారనే అంశంపై స్పష్టత వచ్చాక అందుకు అనుగుణంగా మార్పులు చేర్పులకు అవకాశం ఉంది.
పెరగనున్న జీహెచ్‌ఎంసీ పరిధి


