చోటా నేతల్లో నైరాశ్యం
పహాడీషరీఫ్: ఓఆర్‌ఆర్ లోపలి యూఎల్‌బీలను(అర్బన్ లోకల్ బాడీస్) జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంతో జల్‌పల్లి మున్సిపాలిటీలోని ద్వితీయ శ్రేణి నాయకుల్లో నైరాశ్యం ఏర్పడింది. ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులు జీహెచ్‌ఎంసీలో కార్పొరేటర్ అయ్యేందుకు ఇదే సరైన అదునుగా భావిస్తున్నారు. వాస్తవానికి జల్‌పల్లి మున్సిపాలిటీ పాలక మండలి గడువు ఈ ఏడాది జనవరి 25వ తేదీతో ముగిసింది. అప్పటి నుంచి మాజీ కౌన్సిలర్లతో పాటు కొత్తగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇన్నాళ్ల పాటు నాయకులు క్షేత్రస్థాయిలో తమ వంతు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.
తగ్గనున్న నాయకత్వం
మున్సిపల్‌లో 1,12 లక్షల జనాభా, 85 వేల ఓటర్లు, 28 వార్డులు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రధానమైన మూడు పార్టీలను పరిగణనలోకి తీసుకున్నా దాదాపు 100 మంది వరకు యాక్టివ్ లీడర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చారు. కానీ మున్సిపాలిటీని జీహెచ్‌ంసీలో విలీనం చేస్తే సగటున 30 వేల ఓటర్లకు ఒక డివిజన్ చొప్పున, మూడు డివిజన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. వెరసి 10–15 మంది నాయకులే ప్రధానం కానున్నారు. ఈ డివిజన్లలో కార్పొరేటర్‌గా పోటీ చేయాలంటే కోట్ల రూపాయలు వెచ్చించేంత పోటీ ఉండనున్న నేపథ్యంలో మాజీ కౌన్సిలర్లు సైతం పోటీకి దూరంగా ఉండే పరిస్థితి నెలకొంది.
పెరగనున్న పన్నుల భారం
పెద్ద ఎత్తున సమస్యలతో కూడిన జల్‌పల్లి లాంటి మున్సిపాలిటీని జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడం ద్వారా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా పారిశుద్ధ్య సమస్యను అధిగమించడానికి కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు అవసరమైన మేరకు యంత్రాలను కూడా సమకూర్చనున్నారు. రోడ్లు, డ్రైనేజీ లాంటి సమస్యలకు పరిష్కారం లభించనుంది. మరోవైపు ఇక్కడి ప్రజలపై జీహెచ్‌ఎంసీ నిబంధనల మేరకు పెద్ద ఎత్తున పన్నుల భారం కూడా పడే అవకాశం లేకపోలేదు.


