పొరపాట్లకు తావివ్వొద్దు
● పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
● ఎన్నికల సాధారణ పరిశీలకుడు ప్రశాంత్ జీవన్ పాటిల్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పంచాయతీ ఎన్నికల్లో పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా నిర్వహించాలని ఎన్నికల సాధారణ పరిశీలకుడు ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం ఆయన జిల్లా వ్యయ పరిశీలకులు ఆర్య, కలెక్టర్ సి.నారాయణరెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణపై ఆర్వోలు, ఏఆర్‌ఓలు, పీఓ, ఏపీఓలకు, జోనల్ అధికారులు, సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని, నోడల్ అధికారులు అవసరమైతే వారి కార్యాలయం నుంచి లేదా ఇతర సిబ్బందిని సహాయకులుగా నియమించుకోవాలన్నారు. ఈ సందర్భంగా బ్యాలెట్ పేపర్ల ముద్రణ, మెటీరియల్ మేనేజ్‌మెంట్, ఎన్నికల సిబ్బంది, జోనల్ అధికారుల నియామకం, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించి ప్రతిరోజు నివేదికలు పంపేలా ఎంసీసీ నోడల్ అధికారి పర్యవేక్షించాలని పేర్కొన్నారు. అభ్యర్థులు ఖరారైన తర్వాత వారి ఖర్చులకు సంబంధించిన వివరాలు, రిపోర్టులను వ్యయ నోడల్ అధికారి, బ్యాలెట్ పేపర్లను బ్యాలెట్ అధికారి చూడాలన్నారు. రాజకీయ ప్రకటనలకు సంబంధించి మీడియా సర్టిఫికేషన్, మా నిటరింగ్ కమిటీ, సోషల్ మీడియా ద్వారా నిర్వర్తించే విధులు సంబంధిత అధికారి చూడాలని ఆదేశించారు. ఎక్కడా అలసత్వానికి తావివ్వొద్దని, ఎన్నికల విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే నియమావళి ప్రకారం కఠిన చర్యలు తప్పవని ప్రశాంత్ జీవన్ పాటిల్ హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జెడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, డీపీఓ సురేష్ మోహన్, నోడల్ అధికారులు, ఆర్డీవోలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.


