ఫ్లైవుడ్ వర్కర్ అదృశ్యం
పహాడీషరీఫ్: పని నిమిత్తం బయటికి వెళ్లిన యువకుడు కనిపించకుండా పోయాడు. ఈ సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. జల్‌పల్లి శ్రీరాం కాలనీకి చెందిన టి.రమణ కుమారుడు సాంబశివరావు(22) ఫ్లైవుడ్ వర్క్ చేస్తుంటాడు. ఒక్కోసారి 10–15 రోజులకు ఆర్డర్‌లపై బయటికి వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలోనే 45 రోజుల క్రితం పనికి వెళ్లిన యువకుడు తిరిగి ఇంటికి రాలేదు. ఈ నెల 13వ తేదీనా తన మేన మరుదలకు ‘ఆదివారం వస్తాను.. ఇంట్లో చెప్పమని’వాట్సాప్‌లో సందేశం పంపాడు. అనంతరం స్విచ్ఛాప్ చేశాడు. ఈ విషయమై యువకుడి తండ్రి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌లో గాని 87126 62367 నంబర్‌లోగానీ సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.
ముచ్చర్లలో తల్లీబిడ్డలు..
యాచారం: ఏడాది చిన్నారితో కలిసి తల్లి అదృశ్యమైన ఘటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సత్యనారాయణ తెలిపిన ప్రకారం.. ఠాణా పరిధిలోని ముచ్చర్ల గ్రామానికి చెందిన భాగ్యమ్మ తన ఏడాది వయసున్న చిన్నారితో కలిసి మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయింది. భర్త శ్రీశైలం ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బీటెక్ విద్యార్థిని బలవన్మరణం
యాచారం: బీటెక్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన బుధవారం మాల్‌లో చోటు చేసుకుంది. యాచారం ఎస్‌ఐ మధు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన గొల్లపల్లి సింధు(20) నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. గున్‌గల్ అమ్మమ్మ ఇంటి దగ్గర నుంచి రెండు రోజుల క్రితం తల్లిదండ్రులను చూసేందుకు మాల్‌కు వచ్చింది. ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి జంగయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నిద్రలోనే వ్యక్తి మృతి
మొయినాబాద్‌రూరల్: నిద్రలోనే వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మొయినాబాద్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. నాగిరెడ్డిగూడకు చెందిన నరేశ్(30) మంగళవారం రాత్రి ఇంటికి వచ్చి పడుకున్నాడు. ఉదయం భార్య జ్యోతి లేపేందుకు యత్నించగా స్పందించలేదు. దీంతో ఆమె స్థానికుల సాయంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


