అస్తవ్యస్తంగా రిజర్వేషన్ల ప్రక్రియ
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
ఇబ్రహీంపట్నం: స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు గందరగోళంగా ఉన్నాయని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో నమ్మిన పాపానికి బీసీలను కాంగ్రెస్ పార్టీ నిలువునా ముంచిందని అన్నారు. సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉందని.. బీసీలకు అన్యాయం జరిగిందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని, ఏటా రూ.20 వేల కోట్లు బీసీ సబ్‌ప్లాన్ కింద ఇస్తామని, ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో 25 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్లలో 23 శాతం కూడా ఇవ్వలేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు న్యాయబద్ధంగా దక్కాల్సిన స్థానాలు దక్కకుండా అన్యాయం చేసిందని ఆరోపించారు.


