తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
పహాడీషరీఫ్: చాంద్రాయణగుట్ట–పహాడీషరీఫ్ ర హదారికి మహర్దశ పట్టుకుంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే జాతీయ రహదారి(ఎన్‌హెచ్–765)పై ఆరు కిలోమీటర్ల పొడవులో నూతనంగా నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు భారత జాతీయ రహదారుల అధికార సంస్థ అంగీకరించింది. నగరం నుంచి శ్రీశైలం ఘాట్ రోడ్డు వరకు గతంలో రెండు వరుసలుగా మాత్రమే ఉండేది. దీన్ని జాతీయ రహదారిగా గుర్తించి 2015–16 మధ్యకాలంలో తుక్కుగూడ నుంచి ఘాట్ రోడ్డు వరకు విస్తరించారు. కానీ పహాడీషరీఫ్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మాత్రం విస్తరించకపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు ఈ రోడ్డు విస్తీర్ణ విషయమై కేంద్రంతో సంప్రదింపులు జరపడంతో ఎట్టకేలకు విస్తరణకు రూ.100 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి పేర్కొన్నారు. ఇటీవల నేషనల్ హైవే అధికారులతో కలిసి ఈ రహదారిని ఆమె పరిశీలించారు.
నిబంధనలతో నిర్మాణం
చాంద్రాయణగుట్ట నుంచి పహాడీషరీఫ్‌లోని బైపాస్ రోడ్డు వరకు 5.7 కిలోమీటర్ల పొడవులో ఈ రహదారి నిర్మాణం జరగనుంది. చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్‌ను మొదలుకొని సీఆర్‌పీఎఫ్, జల్‌పల్లి మున్సిపాలిటీలోని ఎర్రకుంట, షాహిన్‌నగర్, జల్‌పల్లి కమాన్ మీదుగా బైపాస్ రోడ్డు వద్ద ముగియనుంది. ఈ రోడ్డుకు ఇరువైపులా వ్యాపార సముదాయాలు కలిగి ఉన్న నేపథ్యంలో ప్రత్యేక కారిడార్‌గా నిర్మాణం చేయనున్నారు. నాలుగు లేన్ల రోడ్డు, మధ్యలో సెంటర్ డివైడర్, కిరువైపులా వర్షపు నీరు, వ్యర్థ జలాలు వెళ్లేలా బాక్స్ డ్రెయిన్‌లు, ఇనుప జాలీ ఏర్పాటు చేసి జాతీయ రహదారి నిబంధనలతో పూర్తిస్థాయిలో పటిష్టంగా నిర్మాణం చేయనున్నారు.
విస్తరిస్తే మేలు
నగరం నుంచి అంతర్జాతీయ విమానాశ్రయం, శ్రీశైలం, తుక్కుగూడ, కందుకూర్, ఆమనగల్లు, కల్వకుర్తి, అచ్చంపేట లాంటి ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో ఈ రూట్‌లో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇరుకు రోడ్డు, గోతులమయం, ఆపై మురుగునీరు పారుతుండడంతో వాహనదారులకు పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. గోతుల వద్ద తరచూ ట్రాఫిక్ స్తంభించిపోతుండడంతో ఒక్కోసారి విమాన ప్రయాణికులు సకాలంలో చేరుకోలేక ఫ్లైట్ మిస్ అయిన సందర్భాలున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులకు పహాడీషరీఫ్ వరకు రా వడం ఒక ఎత్తైతే.. పహాడీ నుంచి చాంద్రాయణగుట్టకు చేరుకోవడం మరో ఎత్తుగా మారింది. ట్రాఫిక్ జాంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డును విస్తరిస్తే ఎంతో మందికి మేలు జరగనుంది.
ఎర్రకుంట–పహాడీషరీఫ్ రహదారికి మహర్దశ
రోడ్డు విస్తరణకు ఎన్‌హెచ్‌ఏఐ అంగీకారం
రూ.100 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనులు


