సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం
● ఓఆర్‌ఆర్‌పై లారీని వెనుక నుంచి ఢీకొన్ని డీసీఎం
● ఒకరి దుర్మరణం, ఇద్దరికి తీవ్ర గాయాలు
అబ్దుల్లాపూర్‌మెట్: ఔటర్ రింగ్ రోడ్డుపై ముందుగా వెళ్తున్న ఓ లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకు వేయడంతో వెనుక నుంచి వచ్చి డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందడంతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ గుజ్జ గ్రామానికి చెందిన బంగారు సతీష్‌కుమార్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కీసర గ్రామానికి చెందిన సూరజ్‌కుమార్‌రామ్, అజిత్ రామ్‌లు అదే మండలం నాగారం గ్రామానికి చెందిన రాచకొండ భిక్షం వద్ద కోళ్లు సరఫరా చేసే డీసీఎంపై ఏడేళ్లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున యాచారం నుంచి దమ్మాయిగూడకు కోళ్లను తీసుకుని వస్తుండగా మార్గమధ్యలో ఔటర్ రింగ్‌రోడ్డుపై గండిచెరువు సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న ఓ లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేసి నిలిపివేశాడు. దీంతో అప్పటికే వేగంగా ఉన్న డీసీఎం లారీకి వెనుక భాగంలో ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఎంలో ప్రయాణిస్తున్న సూరజ్‌కుమార్ రామ్(34) క్యాబిన్‌లో ఇరుక్కుపోయి శరీరమంతా నుజ్జునుజ్జు అయి అక్కడిక్కడే మృతిచెందాడు. సతీష్‌కుమార్, అజిత్‌రామ్‌లకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం డీఆర్‌డీఓ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


