గో‘పాల’రత్న
బడంగ్‌పేట్: చిన్నప్పటి ను ంచి పాడిపశువులంటే ఆయనకు ఎంతో ఇష్టం.. ఆ ఇష్టంతోనే డెయిరీ ఫాం ఏర్పాటు చేశారు.. నిత్యం వేల లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తూ నాణ్యమైన పాలను అందిస్తున్నారు.. ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు.. ఆయన సేవలను గుర్తించిన కేంద్రం ‘జాతీయ గోపాలరత్న’ అవార్డుకు ఎంపిక చేసింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో జన్మించిన కృష్ణారెడ్డి జియాలజీలో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ పూర్తి చేసి హైదరాబాద్‌లోని జియాలజీ ఆఫ్ ఇండియాలో సీనియర్ జియాలజిస్టుగా పనిచేశారు. 2000 సంవత్సరంలో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. డెయిరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుని బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్‌గుల్‌లో ఐదెకరాల్లో శ్రీకారం చుట్టారు. 100 గేదెలు, 50 ఆవులతో నిత్యం వెయ్యి లీటర్ల ఉత్పత్తి సాధిస్తూ నగరానికి నాణ్యమైన పాలను అందిస్తున్నారు. డెయిరీఫాంలో 50 మందికిపైగా ఉపాధి కల్పిస్తున్నారు. ఇక్కడి పశువులకు కృత్రిమ గర్భధారణ, వైద్యాన్ని అందిస్తూ వస్తున్నారు. 39 ఏళ్లుగా డెయిరీఫాం నిర్వహిస్తూ వస్తున్నారు.
తెలంగాణ నుంచి..
73 ఏళ్ల వయసులోనూ కృష్ణారెడ్డి నిత్యం డెయిరీఫాంకు వెళ్లి పశువుల బాగోగులు చూస్తుంటారు. ఈ సేవనే జాతీయ గోపాలరత్న అవార్డుకు ఎంపికయ్యేలా చేసింది. కేంద్ర మత్స్య పశుసంవర్థక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ జాతీయ గోపాలరత్న–2025 (ఎన్‌జీఆర్‌ఏ) అవార్డులు ప్రకటించగా అందులో తెలంగాణ నుంచి కృష్ణారెడ్డి ఒక్కరే ఉండడం విశేషం. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఆయన పలు అవార్డులు అందుకున్నారు. ఈనెల 26న జాతీయ పాల దినోత్సవం రోజున ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకోనున్నారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డిని పలకరించగా మూగ జీవాలకు సేవ చేయడంతో పాటు స్వచ్ఛమైన పాలను అందిచండంలో ఎంతో ఆనందం పొందుతున్నానని తెలిపారు. యువత డెయిరీ రంగాన్ని ఎంచుకోవాలని సూచించారు. జాతీయ అవార్డుకు ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు కృష్ణారెడ్డి జాతీయ అవార్డుకు ఎంపిక కావడంపై నాదర్‌గుల్‌వాసులు హర్షం వ్యక్తం చేశారు.
కృష్ణారెడ్డికి జాతీయ అవార్డు
ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
ఈనెల 26న ప్రదానం
రాష్ట్రం నుంచి ఒకేఒక్కరు


