
ఖర్చుకు వెనుకాడొద్దు
నిధులు మంజూరు బాధ్యత నాది
● కలెక్టర్ నారాయణరెడ్డి
● వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలోఆకస్మిక తనిఖీ
● సమస్యలు వివరించిన మహేశ్వరం మెడికల్ కాలేజీ అనుబంధ ఆస్పత్రి వైద్య సిబ్బంది
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘కోవిడ్ సమయంలో ఆస్పత్రి భవనంపై ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్డు పైకప్పు లీకేజీ అవుతోంది. సిటీ స్కాన్ మంజూరైనప్పటికీ.. స్థలాభావ సమస్యతో ఇప్పటికీ ఏర్పాటు చేయలేదు. టెక్నీషియన్లు అందుబాటులో లేరు. రక్తనిధి కేంద్రం లేకపోవడంతో రక్తస్త్రావంతో బాధపడుతున్న రోగులకు సత్వర సేవలు అందించలేకపోతున్నాం. వైద్యుల నిష్పత్తి మేరకు గదులు లేకపోవడంతో ఔట్ పేషంట్ విభాగానికి వచ్చే రోగులకు సేవలు అందించలేని పరిస్థితి తలెత్తుతోంది’అంటూ మహేశ్వరం మెడికల్ కాలేజీ అనుబంధ ఆస్పత్రి (వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి) వైద్య సిబ్బంది కలెక్టర్ నారాయణరెడ్డి ముందు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. వైద్యులు, సిబ్బంది చెప్పిన అంశాలను కలెక్టర్ సావధానంగా ఆలకించారు. ‘ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించే బాధ్యత నాదీ.. అయితే ఆస్పత్రికి ఆపదలో వచ్చిన నిరుపేద రోగులకు సత్వర, మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాల్సిన బాధ్యత మీదే’అని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఆకస్మిక తనిఖీ.. వైద్యసేవలపై ఆరా
మంగళవారం వనస్థలిపురం ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్ నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఔట్, ఇన్ పేషంట్ విభాగాలు సహా ఆపరేషన్ థియేటర్, ఫార్మసీ విభాగాలను పరిశీలించారు. రోగులకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్య పరీక్షలు చేస్తున్నారా? మందులు ఇస్తున్నారా? అంటూ రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది రోగుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆస్పత్రి పడకల సామర్థ్యాన్ని 100 నుంచి 200 పెంచారు కానీ..అనువైన స్థలం లేక అదనపు పడకలను ఏర్పాటు చేయలేకపోతున్నట్లు స్పష్టం చేయగా, ఆస్పత్రి భవనం పై అంతస్తులో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్డుకు తక్షణమే రిపేర్లు చేసి, రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. ఇందుకు ఎంత ఖర్చైనా వెనుకాడొద్దన్నారు. వెంటనే పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
సీటీస్కాన్ పెట్టండి.. టెక్నీషియన్లను తీసుకోండి
మెడికల్ కాలేజీ నిబంధనల ప్రకారం ఆస్పత్రిలో ిసీటీస్కాన్ ఏర్పాటు చేయాల్సి ఉందని, 2024లోనే సీటీస్కాన్ మంజూరైందని, ఆస్పత్రిలో అనువైన స్థలం లేక ఏర్పాటు చేయలేకపోయినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఆస్పత్రి ఆవరణలోని ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్ డిస్పెన్సరీలను పక్కనే ఉన్న వార్డు ఆఫీసుకు తరలించి, ఆ ఖాళీ ప్రదేశంలో సీటీస్కాన్ ఏర్పాటు చేయించాలని అధికారులకు సూచించారు. రక్తనిధి కేంద్రం ఏర్పాటు సహా అవసరమైన టెక్నీషియన్లను ఔట్‌సోర్సింగ్ ప్రతిపాదికను నియమించుకోవాలని ఆదేశించారు. రోగులకు సేవలు అందించే విషయంలో రాజీపడొద్దన్నారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్యలోపం, తాగునీటి కొరత లేకుండా చూసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్, అదనపు డీఎండీ డాక్టర్ వాణి, ప్రిన్సిపాల్ డాక్టర్ త్రివేణి, వైస్ ప్రిన్సిపాల్ తఖీయుద్దీన్, ఆర్‌ఎంఓలు జయమాల, రాజ్‌కుమార్, వైద్య మౌలిక సదుపాయాల సంస్థ చీఫ్ ఇంజనీర్ దేవేందర్, ఈఈ అజీజ్, ఇబ్రహీంపట్నం ఆర్‌డీఓ అనంతరెడ్డి, ఎల్బీనగర్ డిప్యూటీ కమిషనర్ యాదయ్య తదితరులు ఉన్నారు.