
ఎల్లమ్మ కల్యాణం.. ఉప్పొంగిన భక్తిభావం
అమీర్‌పేట: డప్పుల దరువులు.. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు.. ఎల్లమ్మ నామస్మరణలు మార్మోగాయి. ఆలయ పుర వీధులు పసుపుమయంగా మారాయి. మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది. ఉదయం 4 గంటలకు అభిషేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కల్యాణ వేదికపైకి తీసుకువచ్చారు. ఉత్తరా నక్షత్ర యుక్త అభిజిత్ లగ్న సుముహూర్తంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య 11.51 గంటలకు కల్యాణం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నామని మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
కల్యాణాన్ని తిలకించిన ప్రముఖులు..
అమ్మవారి కల్యాణ మహోత్సవానికి పలువురు ప్రముఖులు, భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్, మల్లారెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కలెక్టర్ దాసరి హరిచందన, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ వెంకట్రావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, డీజీ సౌమ్య మిశ్రా, మాజీ ఎమ్మెల్యేలు మర్రి శశిధర్‌రెడ్డి, కాట్రగడ్డ ప్రసూన, అమీర్‌పేట కార్పొరేటర్ సరళ, మాజీ కార్పొరేటర్ శేషుకుమారి, ఈఓ మహేందర్ గౌడ్, చైర్మన్ సాయిబాబా గౌడ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సతీమణి కావ్యారెడ్డి, జోగిని శ్యామల, కోట నీలిమ, దైవజ్ఞ శర్మ తదితరులు పాల్గొన్నారు.
అదృశ్యమైన యువకుడు శవమై తేలాడు
రాజేంద్రనగర్: అదృశ్యమై యువకుడు హిమాయత్‌సాగర్‌లో శవమై తేలిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై మామిడి కిశోర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హిమాయత్‌సాగర్‌కు చెందిన ముఖేశ్ (35) జూలాయిగా తిరుగుతున్నాడు. గతంలో వివాహం జరిగినా అతను మద్యానికి బానిస కావడం, చిల్లర దొంగతనం చేస్తుండటంతో భార్య అతడి నుంచి దూరంగా ఉంటోంది. గత నెలలో అతను కిస్మత్‌పూర్ ప్రాంతంలోని ఓ ఆన్‌లైన్ క్యాష్ సెంటర్ నుంచి నగదు తీసుకుని పరారయ్యాడు. అప్పటి నుంచి కనిపించకుండా పోయిన ముఖేశ్ మంగళవారం హిమాయత్‌సాగర్‌లో శవమై తేలాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఎల్లమ్మ కల్యాణం.. ఉప్పొంగిన భక్తిభావం

ఎల్లమ్మ కల్యాణం.. ఉప్పొంగిన భక్తిభావం