
మహేశ్వరంలో ‘మలబార్ గోల్డ్ అండ్ డైమండ్’
మహేశ్వరం: మండల పరిధిలోని కేసీ తండా ఎలక్ట్రానిక్ పార్కులో మరో భారీ పరిశ్రమ రూపుదిద్దుకుంది. సుమారు రూ.750 కోట్ల నిధులతో 3.7 ఎకరాల విస్తీర్ణంలో 2.3లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తయారీ పరిశ్రమ ఆవిష్కరణకు తుది ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పరిశ్రమను గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు యాజమాన్యం యోచిస్తోంది. ఈ కంపెనీ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 2 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
700 మంది స్థానికులకు ఉపాధి
ఇక్కడ పూర్తి స్థాయి స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రం, డిజైనింగ్ స్టూడియో, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. యూనిట్‌లో ఆటోమేటెడ్ గిడ్డంగి సౌకర్యం ఉంది. కంపెనీలో 33 శాతం గ్రీనరీని ఏర్పాటు చేశారు. ఏడాదికి సుమారు పది టన్నుల బంగారు ఆభరణాలు, 1.5 లక్షల క్యారెట్ల వజ్రాభరణాలు తయారు చేయగల సామర్థ్యం ఈ యూనిట్ సొంతం. ఇటలీ, అమెరికా, జర్మనీ దేశాలకు చెందిన పరిశ్రమ నిపుణుల సహకారంతో సీఎన్‌సీ యంత్రాలు, తాజా సాంకేతికతో కూడిన గొలుసు తయారీ, లేజర్ కట్ యంత్రాలున్నాయి. సుమారు 700 మంది స్థానికులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారు. 2022లో అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ ఈ కంపెనీకి శంకుస్థాపన చేఽశారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో 14 కంపెనీలున్నాయి. దేశంలో ఎనిమిది చోట్ల మలబార్ పరిశ్రమలున్నాయి. ఈ పరిశ్రమ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తదితరులు హాజరుకానున్నారు.
రూ.750 కోట్ల పెట్టుబడితో అతి పెద్ద ఆభరణాల తయారీ పరిశ్రమ
రేపు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి