
సర్వే నంబర్లు మాయం
రికార్డుల్లో ఒకరు.. పొజిషన్‌లో మరొకరు
● పక్కాగా నిర్ధారిస్తే తప్పా తేలని పంచాయితీ ● వేధిస్తున్న సర్వేయర్ల కొరత ● రెవెన్యూ సదస్సుల్లో సర్వేనంబర్ల మిస్సింగ్‌కు 8,996 ఫిర్యాదులు ● జూలై 10లోగా సమస్యల పరిష్కారం సాధ్యమేనా..?
సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లాలోని పలు భూముల సర్వే నంబర్లు మాయమయ్యాయి. క్షేత్రస్థాయిలోని భూములకు, రెవెన్యూ కార్యాలయాల్లోని రికార్డులకు అసలు పొంతన కుదరడం లేదు. జూన్ మూడు నుంచి 23 వరకు నిర్వహించిన భూ భారతి సదస్సుల్లో భాగంగా ప్రజల నుంచి సర్వే నంబర్ల మిస్సింగ్‌కు సంబంధించిన దరఖాస్తులే ఎక్కువగా అందాయి. ప్రజల నుంచి వచ్చిన ఈ అర్జీలను జూలై 10లోగా పరిష్కరించాల్సిందిగా ప్రభుత్వం సంబంధిత రెవెన్యూ అధికారులను ఆదేశించింది. భూ కొలతలు పక్కగా నిర్వహించకుండా, ఉన్న భూములకు హద్దులు నిర్ధారించకుండా, ఏ సర్వే నంబర్‌లో..? ఏ ఏ పట్టా దారులున్నారో? తేల్చకుండా భూ సమస్యలు పరిష్కారం అవు తా యా అంటే అధికారుల వద్ద సమాధానం లేదు. అందిన అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా, ఆమోదించడమో..తిరస్కరించడమో? చేయాల్సి ఉంది. అకా రణంగా తిరస్కరిస్తే.. ఆయా అర్జీదారులు అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉండటంతో ఏం చేయాలో? తోచక అధికారులు తలపట్టుకుంటున్నారు.
హద్దులు దాటిన గద్దలు
జిల్లాలో 12,43,035 లక్షల ఎకరాల భూములుండగా వీటిలో 2,18,53.02 ఎకరాల ప్రభుత్వ, 64,803 ఎకరాలు అటవీ భూములున్నాయి. జిల్లా వ్యాప్తంగా 90,911 ఎకరాల అసైన్డ్ భూమి ఉండగా ఇందులో 52,315 మంది నిరుపేద రైతులకు 75,450.29 ఎకరాలను అసైన్ చేసింది. మరో 25, 597.35 ఎకరాలు ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది.అసైన్డ్ చేసిన భూమిలో ఆ తర్వాత 9,8 85.13 ఎకరాలు చేతులు మారినట్లు గుర్తించి, 42, 278 అసైన్డ్ ఉల్లంఘన కేసులను నమోదు చేసింది.
● భూదాన్ బోర్డు పేరున 21,931.03 ఎకరాలుండగా, దీనిలో 9,678 మంది నిరుపేదలకు పంచారు. మిగలిన భూమి కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లింది. – దేవాదాయశాఖకు 9,360.01 ఎకరాల భూములు ఉండాల్సి ఉండగా, వీటిలో ఇప్పటికే 1,148.15ఎకరాలు అన్యాక్రాంతమైంది.
● భూపరిమితి చట్టం(యూఎల్‌సీ) పరిధిలో 9 వేల ఎకరాలకుపైగా భూములుండగా.. వీటిలో 840 ఎకరాలు కోర్టు కేసుల్లో ఉన్నాయి.
● వక్ఫ్‌బోర్డు పరిధిలో 14,785.17 ఎకరాలు ఉండగా, వీటిలో ఇప్పటికే 13,480.25 ఎకరాలు ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లింది.
పొజీషన్‌కు భిన్నంగా సర్వే నంబర్లు
ప్రభుత్వ, పట్టా భూములతో పాటు అటవీ,సీలింగ్, లావణి, శిఖం పట్టా భూములు కూడా ఉన్నాయి. అనేక సర్వే నంబర్లలోని భూములు రెవెన్యూ నక్షకు, విస్తీర్ణానికి భిన్నంగా ఉన్నాయి. గత ప్రభు త్వం భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లోనూ ఈ లోపాలు భారీగా బయటపడ్డాయి. భూ విస్తీర్ణానికి మించి రికార్డుల్లో పేర్లు నమోదయ్యాయి. పొజిషన్‌కు భిన్నంగా సర్వే నంబర్లు, రికార్డులు,పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేశారు. నిజమైన లబ్ధిదారులతో పాటు అడ్డదారుల్లో భూములు కొల్లగొట్టిన వారు సైతం దరఖాస్తులు సమర్పించారు. భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో భాగంగా ఆయా బాధితులు మాన్యువల్‌గా అందజేసిన దరఖాస్తులను, ప్రస్తుతం సిటిజన్ పోర్టల్‌లో నమోదు చేసే ప్రక్రియను చేపట్టారు. ఆయా ఆర్జీలన్నీ భూ భారతి పోర్టల్‌కు చేరుకోనున్నాయి.
కొత్త నియామకాలు చేపట్టకుండా..
భూములన్నీ నగరానికి ఆనుకుని ఉండడం, ఐటీ, రియల్ ఎస్టేట్ కారణంగా జిల్లాలోని భూ ముల ధరలు అమాంతం పెరిగిపోవడం, అదే స్థాయిలో భూవిస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, సరిహ ద్దు వివాదాలు వెలుగు చూడటం తెలిసిందే. ఈ వివాదాల పరిష్కారంలో సర్వేయర్లు ఇచ్చే రెవె న్యూ నివేదికలే కీలకంగా మారుతుంటాయి. జిల్లాలో 27 మండలాలుండగా, 526 గ్రామ పంచాయతీలున్నాయి. వీటి పరిధిలో కేవలం 14 మంది మాత్రమే సర్వేయర్లు పని చేస్తున్నారు. రెండు మండలాలకు ఒకరే సర్వేయర్ పని చేస్తున్నారు. భూ కొలతల నిర్ధారణకు సంబంధించి ప్రస్తుతం క్షేత్రస్థాయిలోని బాధితుల నుంచి వస్తున్న అభ్యర్థనలకు.. హద్దులు నిర్ధారించి ఇస్తున్న నివేదికలకు అసలు పొంతనే ఉండడం లేదు. ఒక్కో విస్తీర్ణాన్ని రెండు నుంచి మూడు సార్లు సర్వే చేయాల్సి వస్తుండడం, ప్రభుత్వ ప్రాజెక్టులకు భూమిని సేకరించడం, ప్రైవేటు వ్యక్తుల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించాల్సి వస్తుండడం ఇబ్బందిగా మారింది. పని భారంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఇటీవల అర్హులైన ప్రైవేటు వ్యక్తులను (లైసెన్స్‌డ్ సర్వేయర్లు) ఎంపిక చేసి నెల రోజులుగా శిక్షణ ఇస్తోంది. ఏళ్ల తరబడి కొత్త వాళ్లను నియమించకుండా పాతవాళ్లకు పని భారాన్ని తగ్గించకుండా మాయమైన ఈ సర్వే నంబర్ల గుర్తింపు ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వం ఆశిస్తున్నట్లు జూలై పదిలోగా ఈ సమస్యలన్నీంటికీ పరిష్కార మార్గం లభిస్తుందా? అంటే అనుమానమే.
రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తులు ఇలా..
అంశం అర్జీలు
పంపిణీ చేసిన దరఖాస్తులు 34,453
ప్రజల నుంచి అందిన ఆర్జీలు 21,050
మిస్సింగ్ సర్వేనంబర్లు 8,966
మ్యూటేషన్ పెండింగ్ 1,165
డీఎస్ పెండింగ్ 1,158
ఎక్స్‌టెంట్ కరెక్షన్ 1,932
లాండ్ నేచర్/క్లాసిఫికేషన్ 967
నేమ్ కరెక్షన్ 742
నిషేధిత జాబితా నుంచి తొలగించుటకు 1,557
నిషేధిత జాబితాలో చేర్చేందుకు 08
అసైన్డ్ భూముల సమస్యలు 656
ఓఆర్‌సీ నాట్ ఇష్యూడ్ 142
38ఇ సర్టిఫికెట్ నాట్ ఇష్యూడ్ 24
సక్సేషన్ పెండింగ్ 1,652
భూ సేకరణ 64
ఇతర సమస్యలు 2,217