
భవిష్యత్ తరాలకు మెరుగైన విద్యావకాశాలు
మంచాల: భవిష్యత్ తరాలకు మెరుగైన విద్యావకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి కార్యదర్శి అజిత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోనే ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దనున్న ఆరుట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను గురువారం సాయంత్రం ఆయన రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో అజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆరుట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచుతామన్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలి పారు. కార్యక్రమంలో తెలంగాణ విద్యా శాఖ సభ్యులు ప్రొఫెసర్ విశ్వేశ్వర రావు, చారకోన వెంకటేశ్, జోష్నా రెడ్డి, డీఈఓ సుశీందర్‌రావు, మండల విద్యాధికారి రాందాస్, ఆరుట్ల ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గిరధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.