
కౌన్సెలింగ్‌కు వచ్చిన వ్యక్తి గుండెపోటుతో మృతి
రాజేంద్రనగర్: భార్యభర్తల మధ్య జరిగిన గొడవ నేపథ్యంలో కౌన్సెలింగ్ కోసం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన వ్యక్తి గుండెపోటుతో మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ ఇన్‌స్పెక్టర్ క్యాస్ట్రో కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... కిస్మత్‌పూర్ దర్గా ఖలీజ్ ఖాన్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇర్ఫాన్ (35) ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడి ఇద్దరూ భార్యలు ఉన్నారు. అయితే కొన్ని రోజులుగా అతను మరో మహిళతో ఉంటున్నాడు. ఈ విషయమై రెండో భార్య ఇషాద్ బేగం రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు భార్యభర్తలను మంగళవారం రాత్రి పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం ఇంటికి వెళ్లాలని సూచించారు. పోలీస్‌స్టేషన్ నుంచి బయటికి రాగానే ఇర్ఫాన్ రోడ్డుపై ఒక్కసారిగా కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు అతడిని అత్తాపూర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు గుండెపోటుగా నిర్ధారించి మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా పరీక్షించచిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బుధవారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇర్ఫాన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.