
అక్కడ ట్రైనింగ్... ఇక్కడ యాక్షన్!
1993 నుంచి లింకులు...
ఐఎస్‌ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ఎల్‌ఈటీ ఉగ్రవాద సంస్థ 1987లో ప్రారంభమైంది. దీని ఛాయలు నగరంలో 1993 నుంచీ ఉన్నాయి. ముంబైకి చెందిన జలీస్ అన్సారీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన అబ్దుల్ కరీం టుండా, కోల్‌కతాకు చెందిన అబ్దుల్ మసూద్, వరంగల్‌కు చెందిన ఆజం ఘోరీ తన్జీమ్ ఇస్లాహుల్ ముస్లిమీన్ (టీఐఎం) పేరుతో ఓ ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేశారు. 1993లో నగరంలోని అబిడ్స్, నాంపల్లి, సికింద్రాబాద్, హుమాయున్‌నగర్, మౌలాలీల్లో బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఆజం ఘోరీతో (2000లో జగిత్యాలలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు) పాటు మిగిలిన ముగ్గురూ మర్కజ్ తోయిబాలో శిక్షణ పొందిన వారే. 1998లో పాకిస్తాన్ నుంచి పాతబస్తీకి వచ్చి, ఇక్కడి యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తూ సలీం జునైద్ పట్టుబడ్డాడు. ఇతడూ అదే టెర్రర్ క్యాంప్‌లో శిక్షణ పొందిన వాడే.
మరో సంస్థ ఏర్పాటు చేసిన ఆజం ఘోరీ...
టీఐఎం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఆజం ఘోరీ 1999లో ఇండియన్ ముస్లిం మహ్మదీయ ముజాహిదీన్ (ఐఎంఎంఎం) ఏర్పాటు చేశాడు. నగరంలోని ఆరు ప్రాంతాలతో పాటు విజయవాడ, బోధన్, నిజామాబాద్‌ల్లోనూ విధ్వంసాలు సృష్టించిన ఈ మాడ్యుల్‌లోని అనేక మంది మురిద్కే వరకు వెళ్లి శిక్షణ పొంది వచ్చిన వాళ్లే. 2001లో గణేష్ నిమజ్జనంలో పేలుళ్లకు కుట్ర పన్నిన అబ్దుల్ అజీజ్ అలియాస్ గిడ్డా అజీజ్, 2002లో దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబ దేవాలయం వద్ద పేలుడుకు పాల్పడిన ఆజం, అజీజ్ తదితరులు, 2004లో సికింద్రాబాద్‌లోని గణేష్ టెంపుల్ పేల్చివేతకు కుట్ర పన్నిన నసీరుద్దీన్ మాడ్యుల్, 2005లో నగర వ్యాప్తంగా పేలుళ్లకు కుట్రపన్నిన నవీద్ మాడ్యుల్... వీటన్నింటి వెనుక ఎల్‌ఈటీనే ఉంది. ఈ విధ్వంసాలు, కుట్రలకు పథక రచన చేసి, పాల్గొన్న వారిలో అత్యధికులు మురిద్కే వరకు వెళ్లి మర్కజ్ తోయిబాను ‘చూసి’ వచ్చిన వాళ్లే.
సౌదీలో ఉద్యోగాల పేరుతో ఎర వేసి...
నగర యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించే ఎల్‌ఈటీ, దాని అనుబంధ సంస్థల నిర్వాహకులు వారిని నేరుగా మర్కజ్ తోయిబాకు చేర్చలేదు. ఎల్‌ఈటీ స్లోగన్స్‌లో ‘హైదరాబాద్ లిబరేషన్’ కూడా కీలకం కావడంతో నగరం, కాన్పూర్‌లకు చెందిన యువతనే ఎక్కువగా ఆకర్షించే వాళ్లు. వీరిని ఉద్యోగాల పేరుతో సౌదీకి తీసుకువెళ్లి అక్కడి నుంచి మురిద్కే పంపేవాళ్లు. ఉగ్రవాద శిక్షణ పూర్తయిన తర్వాత బంగ్లాదేశ్, నేపాల్ మీదుగా హైదరాబాద్ చేర్చేవాళ్లు. మర్కజ్ తోయిబాలో ఉన్న ట్రైనర్లకూ నగరంపై మంచి పట్టు ఉండేది. శిక్షణ కోసం వెళ్లిన యువతతో ఉర్దూలో మాట్లాడటం, సిటీలో ఉన్న కీలక ప్రాంతాల వివరాలు అడగటం చేసే వాళ్లు. చిక్కిన ముష్కరులు, వారి సానుభూతిపరుల విచారణలో ఈ విషయం గుర్తించిన నిఘా వర్గాలు ఆ ట్రైనర్లు ఇక్కడ సంచరించి వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తం చేశారు.
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత బలగాలు ధ్వంసం చేసిన తొమ్మిది ఉగ్రవాద క్యాంపుల్లో మురిద్కేలో ఉన్న లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) టెర్రర్ ఫ్యాక్టరీ కూడా ఉంది. లాహోర్ సమీపంలో నియంత్రణ రేఖకు 30 కిమీ దూరంలో ఉన్న ఈ కీలక క్యాంప్‌ను మర్కజ్ తోయిబా అని పిలుస్తారు. దీనితో హైదరాబాద్‌కు అనేక లింకులు ఉన్నాయి. ఇక్కడి నుంచి వెళ్లిన, ఇక్కడ పట్టుబడిన అనేక మంది ఉగ్రవాదులు, సానుభూతిపరులు మర్కజ్ తోయిబాలో శిక్షణ పొందడమో, అక్కడ జరిగే వార్షిక సమావేశాల్లో పాల్గొనడమో చేసిన వాళ్లే. 1993 నాటి జలీస్ అన్సారీ, 1998లో చిక్కిన పాకిస్థానీ సలీం జునైద్ నుంచి ఇప్పటికీ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న కుర్మగూడకు చెందిన ఫర్హాతుల్లా ఘోరీ వరకు ఈ కోవకు చెందిన వాళ్లే.
– సాక్షి, సిటీబ్యూరో
●
ఫర్హాతుల్లా పాత్ర అత్యంత కీలకం...
ఎల్‌ఈటీతో పాటు మర్కజ్ తోయిబాలోనూ కూర్మగూడ వాసి ఫర్హాతుల్లా ఘోరీ పాత్ర అత్యంత కీలకమని నిఘా వర్గాలు చెప్తున్నాయి. 1998లోనే ఉగ్రవాదం వైపు మళ్లిన ఇతగాడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 2002లో గుజరాత్‌లోని అక్షర్‌ధామ్ దేవాలయంపై జరిగిన దాడి కేసుతో ఇతని వ్యవహారాలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. 2004లో నగరం కేంద్రంగా బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి హత్యకు కుట్ర జరిగింది. ఘోరీ అప్పట్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషేమహ్మద్‌కు (జేఈఎం) సానుభూతిపరుడిగా ఉండి ఈ కేసులోనూ నిందితుడిగా మారాడు. ఆ తర్వాత 2005లో టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై జరిగిన మానవబాంబు దాడి కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు. 2012 నాటి బెంగళూరు ‘హుజీ కుట్ర’ కేసులోనూ వాంటెడ్‌గా ఉన్నాడు. 2022లో దసరా నేపథ్యంలో విధ్వంసాలకు కుట్రపన్ని ఽహ్యాండ్ గ్రెనేడ్స్‌తో సహా చిక్కిన ‘ఉగ్ర త్రయం’లో కీలకమైన జాహెద్‌తోనూ సంబంధాలు కలిగి ఉన్నాడు. ఇతను గత ఏడాది వరకూ మర్కజ్ తోయిబాలో జరిగే వార్షిక సమావేశాలకు హాజరయ్యాడు.
మురిద్కేలో ధ్వంసమైనఎల్‌ఈటీ ‘టెర్రర్ ఫ్యాక్టరీ’
‘సిటీ ఉగ్రవాదుల్లో’ పలువురికి అది సుపరిచితం
జలీస్ అన్సారీ నుంచిఫర్హాతుల్లా ఘోరీ వరకు...
నగరంలో జరిగిన విధ్వంసాలకు అక్కడే కుట్రలు