షాద్‌నగర్ రూరల్: ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీలో అడ్మిషన్ కోసం వెంటనే దోస్త్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేరుకోవాలని గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నీతాపోలె సూచించారు. ఈనెల 21 వరకు అవకాశం ఉందని తెలిపారు. 29న అడ్మిషన్ల కేటాయింపుపై తొలి జాబితా విడుదలవుతుందని పేర్కొన్నారు. ఈనెల 30 నుంచి జూన్ 6 వరకు అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. వివరాలకు 63050 51490, 9885003390, 9703441345 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ఇబ్రహీంపట్నం కళాశాలలో..
ఇబ్రహీంపట్నం: 2025–26 విద్యాసంవత్సరానికి డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ (దోస్త్) ద్వారా ప్రథమ సంవత్సరంలో విద్యార్థులు చేరేందుకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డా.రాధిక సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివరాలకు 89199 96725, 94417 05076, 93810 6920 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
నేడు డయల్ యువర్ డీఎం
షాద్‌నగర్: ఆర్టీసీ ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు మంగళవారం ‘డయల్ యువర్ డీఎం’ నిర్వహించనున్నట్లు షాద్‌నగర్ డిపో మేనేజర్ ఉష తెలిపారు. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజలు, ప్రయాణికులు 9959226287 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలను తెలియజేయడంతో పాటు సలహాలు, సూచనలు అందించాలని కోరారు.
ర్యాంకుల ‘కమ్మదనం’
షాద్‌నగర్ రూరల్: ప్రభుత్వం ప్రకటించిన ఈఏపీ సెట్ ఫలితాల్లో ఫరూఖ్‌నగర్ మండలం కమ్మదనం గురుకుల విద్యార్థినులు సత్తాచాటారు. బైపీసీ విభాగంలో సిరి 2,234 ర్యాంకు, శ్రీహర్షిత 4,643, శిరీష 4,907, సౌమ్య 7,586, కీర్తన 8,741 ర్యాంకు, ఎంపీసీ విభాగంలో శైలజ 22,990 ర్యాంకు, సాయికీర్తన 25,903, మానస 27,493, సాయిప్రియ 28,577 ర్యాంకులు సాధించారు. 77 మంది ఇంటర్ పరీక్షలు రాయగా వంద శాతం ఉత్తీర్ణత సాధించామని ప్రిన్సిపల్ విద్యుల్లత తెలిపారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులతో పాటు సిబ్బందిని అభినందించారు.
నేడు స్పీకర్ పర్యటన
మోమిన్‌పేట: మండల పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు మంగళవారం శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ విచ్చేయనున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శంకర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సుద్దోడ్కతండా బీటీ రోడ్డు, ఏన్కతల పెద్ద చెరువు మరమ్మతులు, మల్‌రెడ్డిగూడెం చెరువు మరమ్మతులు, మొరంగపల్లి, ఎన్కేపల్లి, కేసారం, సయ్యద్‌అల్లిపూర్, ఇజ్రాచిట్టంపల్లి, వెల్‌చాల్, దుర్గంచెర్వు గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. పార్టీ శ్రేణులు సకాలంలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.
క్రికెట్ పోటీలు ప్రారంభం
దుద్యాల్: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో సోమవారం మండలస్థాయి క్రికెట్ పోటీలు(దుద్యాల్ క్రికెట్ ప్రిమియర్ లీగ్) ప్రారంభమయ్యాయి. కొడంగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకారం వేణుగోపాల్, ఎస్‌ఐ యాదగిరి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మెరుగు వెంకటయ్య పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో విద్యార్థులు, యువకులు, ఉద్యోగుల కోసం ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలని సూచించారు.